Mar 9, 2012

అనగనగా ఓ ల్యాబ్ ..


'హమ్మయ్య.. తుఫాను తీరం దాటిందంట్రోయ్. ఇక నేను ఆఫీస్‌కి వెళ్ళొస్తా.'
'ఒరేయ్!!!...ఆ.....గు.' నేను ఆగమనేలోపు వీధిలోకి పరుగెత్తాడు.. నరేష్‌గాడు.
వీడు బయట అడుగుపెట్టడం, బయట నీరు ఇంట్లోకి రావటం ఒకేసారి జరిగాయి.

కాసేపటికి వెనక్కి వచ్చాడు.'ఒరేయ్!! తుఫాను తీరం దాటిందంటే నేల నుంచి సముద్రం వైపు వెళ్లిపోయిందని కాదంట..సముద్రంలోంచి నేలపైకి వచ్చిందని అంట.' తడిసిపోయిన షర్ట్ పిండుకుంటూ చెప్పాడు.
'ఆ ముక్క నేను చెప్పే లోపు పారిపోయావ్‌గా.'
'అయినా మన కాలేజ్ రోజులు మేలురా.ఒక చినుకు పడితే చాలు,కాలేజ్‌కి బంక్ కొట్టి ఇంట్లో కూర్చుని మ్యాచ్ చూసుకునేవాళ్ళం. ఇపుడు వరదలొచ్చినా ఆఫీస్‌కి వెళ్ళాల్సిందే.' ప్యాంటు  అంచుల్నించి కారుతున్న నీళ్ళని కాలుతో అటూ ఇటూ జరుపుతూ అన్నాడు నరేష్‌గాడు.

వాడు ఆ మాటలు అంటూనే ...బ్యాక్‌గ్రౌండ్‌లో న్యూస్ వినిపిస్తుండగా....

'చెన్నైలో భారీ వర్షం.జలమయమైన రోడ్లు.వీధిలో పరుగెడుతూ నీళ్లు ఇళ్లలోకి చిమ్ముతున్న వింత మనిషి.పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న పోలీ....'

...అలా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాను.ఆ రోజుల్లో......
---------------------------------------------------------------------------------------------------------------
అవి నేను BTech చదివే రోజులు...మిట్ట మధ్యాహ్నం. రూం బయట నిల్చుని ఆత్రంగా లోపలికి చూస్తున్నా.

మధ్యలో టేబుల్.. అటూ ఇటూ రెండు కుర్చీలు. ఇటువైపు మా లక్ష్మినారాయణ...దొంగతనానికి వెళ్తూ , మొహానికి grease బదులు పాండ్స్ క్రీం రాసుకుని , SP ఇంటికి వెళ్లి , బీరువా అనుకుని ఫ్రిజ్ తెరిచి అందులో ఉన్న ఐస్ ముక్కల్ని జేబులో వేసుకుని, గేటు దగ్గర పడుకున్న కుక్క తోక తొక్కి, పారిపోతూ పోలీసు జీపు ని లిఫ్ట్  కోసం ఆపి, తడి చేతులతో దొరికిపోయిన దొంగలాగా అయోమయంగా చూస్తున్నాడు మా లక్ష్మిగాడు.

టేబుల్ కి అటువైపు..వీడు ఆపిన జీపులో ఉన్న పోలిసులా విజయగర్వంతో ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు.. మా జిలాని సార్.

'సార్!! మీకు దణ్ణం పెడతా.మీరు ఏం చేసినా ఈ వైవా నేను చెప్పలేను.పాస్ మార్కులేసి నన్ను వదిలెయ్యండి.'

'ఏం చేశావని పాస్ చెయ్యమంటావ్ చెప్పు. Micro Controller program ఇచ్చాను. ప్రోగ్రాం రాయమంటే మధ్యలో ..ఇదేంటిది..C + O2 = CO2 అని రాశావ్... ఎలాగయ్యా మీతో వేగేది. పది క్వశ్చన్స్ అడిగాను. ఒక్క ఆన్సర్ అన్నా చెప్పవయ్యా. ఏదో ఒకటి చెయ్యవయ్యా.'

'ఏదో ఒకటి' అనే మాటకు అర్థాన్ని తనకు అనువుగా మలుచుకుని లక్ష్మిగాడు సడెన్‌గా 'పోని ఒక పాట పాడమంటారా?' అని సార్‌కి ఛాయిస్ లేని క్వశ్చన్  ఇచ్చి, దానికి సమాధానంగా కుర్చీ ఎక్కి ఆయన తేరుకునే లోపు 'అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం' అని మొదలెట్టాడు.
అంతే లాబ్‌లో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నట్టు నటిస్తున్న వాళ్లందరూ ఎక్కడి deviceలు అక్కడ పడేసి.. టేబుల్ చుట్టూ తిరుగుతూ స్టెప్పులు వెయ్యటం స్టార్ట్ చేశారు.

'ఆపండయ్యా....ఆపండయ్యా.. యోవ్...ఆపండయ్యా....ఎలాగయ్యా మీతో..'

'ఏమ్మా మీరు కూడా ఏంటమ్మ.. ఆపండమ్మా..' స్టెప్పులేస్తున్న స్టూడెంట్స్ ని  పెన్ను పేపర్లూ విసురుతూ చెదరగొట్టాడు జిలాని సార్.

ఇపుడు మా సార్ నిస్సహాయ స్థితిలో కనిపించాడు.

'నీకు నేను దణ్ణం పెడుతున్నా. ఏదో ఒకటి చేసి నిన్ను పాస్ చేస్తా. ముందు నువ్ వెళ్ళవయ్యా బాబూ.' అంటూ లక్ష్మిగాడిని బయటకు పంపాడు.

ఇందాక స్టెప్పులేస్తూ జిలాని సార్ కాలు తొక్కి పారిపోయి ఓ మూలలో నిల్చున్నాడు నరేష్‌గాడు. వాడికి ట్రాఫిక్ సిగ్నల్ ప్రోగ్రాం వచ్చింది. ఇందాకట్నించి connecting wire తో తల గోక్కుంటూ తెగ ఆలోచిస్తున్నాడు. అదే wireతో పక్కనే ఉన్న అలివేలుని గోకుతూ..'అలివేలు !!అసలు ట్రాఫిక్ సిగ్నల్‌లో నాలుగో లైట్ ఏ కలర్‌లో ఉంటుంది' అని అడిగాడు.మరి వాడు గోకినందుకు కాలిందో లేక ఆ ప్రశ్నకు  సమాధానం తనకు తెలియదు అని తెలిసి అదే పనిగా అడిగాడు దొంగసచ్చినోడు అని అనుకుందో, 'సార్!! వీడు నన్ను గో....కు...తు..న్నాడు' అని గావుకేక పెట్టబోయి , 'నీకు కావాల్సిన ప్రోగ్రాం నా దగ్గర ఉంది ' అని నరేష్‌గాడు జేబులోంచి micro xerox పేపర్ తియ్యటంతో శాంతించింది.

ఇక నరేష్‌గాడు ఎలాగో తన ప్రోగ్రాం అవగొట్టి , జిలాని సార్ దగ్గరకు వెళ్ళి, 'క్షమించాలి. ట్రాఫిక్ సిగ్నల్‌లో నాలుగో లైట్ వెలిగించలేకపోయాను. ఇక మీ దయ నా ప్రాప్తం' అని వచ్చేప్పుడు తెచ్చుకున్న పూలుపండ్లు, ఒక పట్టు పంచె సార్ చేతిలో పెట్టి ల్యాబ్ నుంచి బయటపడ్డాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో జిలాని సార్ రికార్డుతో తలబాదుకోవటం వాడు చూడలేదు.

ఇదిలా ఉంటే,ల్యాబ్ బయట అమ్మాయిలు గుంపుగా నిల్చుని గుసగుసలాడుకుంటున్నారు. విషయం ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే, చక్రవాకం సీరియల్‌లో జేమ్స్ అంకుల్‌ని ఎవరు కిడ్నాప్ చేశారా అని ఒకరి తల ఒకరు గోక్కుంటున్నారు. ఛీ ఎదవ జీవితం.

ఇంతలో అలివేలు గెంతుకుంటూ వచ్చి.. 'హేయ్ !! మీకు తెలుసా. నరేష్ నాకు ల్యాబ్‌లో చాలా హెల్ప్ చేశాడు. జిలాని సారైతే నన్ను ఒక్క క్వెశ్చన్ కూడా అడగలేదు.' అని నరేష్‌గాడు ఇచ్చిన స్లిప్ చూపించింది.
అది చూసి అమ్మాయిలందరూ ముక్త కంఠంతో "వావ్!!" అన్నారు.

నరేష్... ల్యాబ్... హెల్ప్...ఇందులో ఏదో అపశ్రుతి  ఉందే అని ఆ స్లిప్ చూశాను. "మీ బొంద వావ్!! అయిపోయిన సినిమా షో కి బ్లాక్‌లో టికెట్ కొన్నట్టు..నువ్ రాయాల్సిన ప్రోగ్రాం ఇది కాదు. ఇది నిన్నటి ల్యాబ్ ప్రోగ్రాం. వాడు నిన్ను మోసం చేశాడు. అయినా జిలాని సార్ దీనంగా చూస్తూ నీకు దణ్ణం పెట్టి బయటకు పంపినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇలాంటిదేదో జరిగింటుందని " అని చెప్పా.

ఇదంతా గోడెనకాల నిల్చుని చూస్తున్న నరేష్‌గాడు విజయగర్వంతో వికటాట్టహాసం చేస్తున్నాడు. అది చూసి అలివేలు "ఒరేయ్ సచ్చినోడా!! ఉండు  నీ అంతు చూస్తా" అని పరిగెత్తింది.

"పోవే.. ఫస్ట్ ఇయర్ C ల్యాబ్‌లో ప్రైం నంబర్ అంటే ఏంటి అని నేను అడిగితే.. సార్ వీడికి ప్రైం నంబర్ అంటే తెలీదంట అని గట్టిగా అరచి నన్ను అవమానించావ్‌గా. ఇప్పుడు నీ దిక్కున్న చోట చెప్పుకోపో" అని రన్నింగ్ బస్‌ని ఛేస్ చేసి ఫుట్‌బోర్డ్ మీద ఊగుతూ పారిపోయాడు నరేష్‌గాడు.
-------------------------------------------------------------------------------------------------------------
ఇదంతా ఒకెత్తైతే ఇంటర్‌లో ప్రాక్టికల్స్ మరోలా ఉండేవి. ఏదో మొక్కుబడిగా ప్రాక్టికల్స్ చేయించేవాళ్లు. ఐతే అక్కడ కూడా ల్యాబ్ అసిస్టెంట్ల బిల్డప్ ఏమాత్రం తగ్గేది కాదు . కాకపొతే ల్యాబ్ అసిస్టెంట్‌కంటే మమ్మల్ని ఎక్కువ భయపెట్టే వ్యక్తి మరొకరు ఉన్నారు. అతనే మా కాలేజ్ అటెండర్ రెడ్డప్ప. రోజూ క్లాస్‌రూమ్స్‌కి వచ్చి అటెండెన్స్ వేస్కోవటం దగ్గర్నించి .. ఎవడెవడు క్లాస్ ఎగ్గొట్టి గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్నాడు...ఎవడు ఏ అమ్మాయితో తిరుగుతున్నాడు లాంటి చట్ట వ్యతిరేక పనులను పసిగట్టి మా ప్రిన్సిపల్ EVRకి ఉప్పందించేవాడు. మా EVR ఆ ఉప్పులో కొంచెం కారం కలుపుకుని..అది కాస్త నాలిక్కి రాసుకుని, మంట నషాలానికెక్కాక...మేము మనుషులం అన్న విషయాన్ని కాసేపు తన మనసులోంచి చెరిపేసుకుని చితకబాదేవాడు.

 ఇది పక్కన పెడితే.. మా కెమిస్ట్రి ల్యాబ్‌కి పెద్దదిక్కు రెడ్డప్ప. ఎందుకంటె ఫైనల్ ప్రాక్టికల్స్‌లో ఎవడికి ఎన్ని మార్కులు వస్తాయో మా రెడ్డప్ప మీదే ఆధారపడేది. అంతేకాకుండా వాసన చూసి అది ఏ లవణమో ఠపీమని చెప్పేంత దిట్ట. అప్పట్లో మాకు గోల్డ్‌రింగ్ ఎక్స్‌పరిమెంట్ అని ఉండేది. మా ల్యాబ్ అసిస్టెంట్ MRగాడు ఎంత ట్రై చేసినా ల్యాబ్‌లో ఉన్న వాళ్లకు దగ్గు, తుమ్ములు వచ్చేవి తప్ప టెస్ట్‌ట్యూబ్‌లో గోల్డ్‌రింగ్ మాత్రం వచ్చేది కాదు. ఇలాగే ఓరోజు రింగ్ తెప్పించటానికి విఫలయత్నం చేస్తుంటే మా రెడ్డప్ప వచ్చాడు. MRగాడి చేతిలోంచి టెస్ట్‌ట్యూబ్ లాక్కొని, కొంచెం ఇదీ కొంచెం అదీ కలిపి, వేలితో రెండు సార్లు టంగ్‌టంగ్ అని కొట్టి, చూమంతర్ అన్నాడు. అంతే దగదగ మెరిసిపోతూ టెస్ట్‌ట్యూబ్‌లో గోల్డ్‌రింగ్ కనపడింది. అది చూసి మురిసిపోతూ మా క్లాస్ గర్ల్స్ అందరూ "వావ్!! వాట్ ఏ మ్యాన్ " అన్నారు. కుడి చేతిలో టెస్ట్‌ట్యూబ్, ఎడమ చేతిలో అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకుని ఇంచుమించు Statue of Liberty లెవల్లో నిలబడ్డాడు రెడ్డప్ప. నాలుగు conical flaskలు పగలగొట్టి రెడ్డప్ప నెత్తిమీద చెక్కెయ్యాలన్నంత కోపం వచ్చింది MRగాడికి. వెంటనే టెస్ట్‌ట్యూబ్ లాక్కుని నేను రెండు రింగులు తెప్పించి మీ చేత వహ్వా!! వహ్వా!! అనిపించుకుంటా అని చెప్పి.. ఆ టెస్ట్‌ట్యూబ్‌లో ఉన్న రింగుని నరేష్‌గాడి వేలికి తొడిగి... ఇందాక కలిపిన అదీ ఇదీతో పాటు కొంచం ఏదో కలిపాడు.  

అందరం టెన్షన్‌గా టెస్ట్‌ట్యూబ్ వైపు చూస్తున్నాం. నరేష్‌గాడు మా క్లాస్ ఫిగర్ అనసూయ వైపు చూస్తున్నాడు. అనసూయ వంశిగాడి వైపు చూస్తోంది. వంశిగాడు అటూఇటూ చూసి రెండు టెస్ట్‌ట్యూబ్లు జేబులో వేస్కున్నాడు.
కెమరా మళ్ళీ MR వైపు తిరిగింది. ల్యాబ్ మొత్తం నిశ్శబ్ధం. ముందు పొగొచ్చింది..తర్వాత వాసనొచ్చింది.. ఇంకాసేపటికి పెద్ద శబ్ధం వచ్చింది. రెండు రోజుల తర్వాత మాకు కొత్త ల్యాబ్ అసిస్టెంట్ వచ్చింది. పనిలో పనిగా మా రెడ్డప్పకి నెత్తిమీద ఇంకో కొమ్మొచ్చింది .

ఫైనల్ ప్రాక్టికల్స్‌కి వెళ్లేముందు రెడ్డప్ప చేతిలో యాభై రూపాయలు పెట్టి కాళ్లకు దండం పెట్టుకుని ల్యాబ్‌లో అడుగుపెట్టేవాళ్లం. కాసేపటికి రెడ్డప్ప ల్యాబ్‌లో్‌కి వచ్చి అందరికి ఉప్పందించేవాడు. అంటే ఇది నిజం ఉప్పు అన్నమాట. ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి ఒక్కో పొట్లం ఇస్తూ అది ఏ లవణమో గట్టిగా, మాకు మాత్రమే వినపడేలా చెప్పి వెళ్ళిపోయేవాడు. ఇక చెప్పేదేముంది ఆన్సర్ చుట్టూ ఎక్స్‌పరిమెంట్ అల్లేసి ఎలాగోలా వైవా అవగొట్టి ల్యాబ్ నించి  బయటపడేవాళ్ళం .

ఇక physics ల్యాబ్‌కి పెద్దదిక్కుగా సింగల్ జీన్స్ రమణ ఉండేవాడు. ఆ పేరు వింటే తెలుస్తోందిగా ..ఒకే జీన్స్ ని వారంలో ఆరు రోజులు కాలేజ్‌కి వేసుకొచ్చేవాడు. అంటే ఆదివారం ఉతుక్కుంటాడు అని కాదు. ఆ రోజు అదే ప్యాంట్‌తో సినిమాకి వచ్చేవాడు. మొన్నామధ్య పురావస్తు శాఖ వాళ్ళు మదనపల్లె BT కాలేజ్‌లో తవ్వకాలు జరుపుతుంటే ఈ ప్యాంట్ బయటపడింది. మొదట ఇదేదో బ్రిటిష్ కాలం నాటిది అనుకున్నారు.తర్వాత దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు.ఆ ప్యాంటు అంచులకున్న జిప్స్, సైడ్‌కి కుట్టిన ప్యాచులు, వెనకాల లేబుల్ మీద Ruf n Tuf(నిజంగా ఒరిజినల్) అని తెలుగులో రాసి ఉండటం..ఇన్ని ఆధారాలను చూసి ఇది ఖచ్చితంగా మా రమణదే అని డిసైడ్ అయ్యారు.అతి ఎక్కువ రోజులు ఉతక్కుండా వాడిన జీన్స్ ప్యాంట్ అని చెప్పి మ్యూజియంలో పెట్టారు. అది వేరే విషయం.

ఇక physics ల్యాబ్ విషయానికి వస్తే ..vernier callipersలు , screw gaugeలు కొట్టేయటం, పెన్ క్యాప్‌లో mercury వేస్కోవటం, మా ల్యాబ్ అసిస్టెంట్ 'Boxer' గాడి బైక్ టైర్‌లో గాలి తీసెయ్యటం..ఫైనల్ ప్రాక్టికల్స్‌లో ముందు రీడింగ్స్ రాసేసి తర్వాత ఎక్స్పరిమెంట్ చెయ్యటం..ఇవన్నీ  మాములే.

మరచిపోలేని రోజులు .. తిరిగిరాని రోజులు.. :(

---------------------------------------------------------------------------------------------------------------

Breaking News...అని న్యూస్ రీడర్ గావుకేక పెట్టడంతో నా ఫ్లాష్‌బ్యాక్ బ్రేక్ అయింది.
"ఉదయం నుంచి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగుతున్న వింత మనిషి పట్టివేత. "

వీడెక్కడికి వెళ్ళాడు ... రేయ్ నరేష్‌గా .. ఎక్కడున్నావ్?...


Sep 26, 2010

అనగనగా ఓ మందు పార్టీ

బ్లాగ్ రాసి చాలా రోజులైంది. So ఏదో ఒకటి రాయాలని మొదలుపెట్టాను. చదువుతూ వెళ్లండి. లాజిక్కులు అడక్కండి.

తాగుబోతు-- తను తూలుతూ ప్రపంచమే తలకిందలుగా ఉందని వీరంగం సృష్ఠించే తిక్క సన్నాసి.... తాగుబోతు గురించి వచ్చింది కాబట్టి మందు పార్టీ గురించి మాట్లాడుకుందాం..

బేసిక్‌గా పార్టీ చేసుకోవటానికి ఒక కారణం అంటూ ఉండదు.మన సౌలభ్యాన్ని మరియూ పార్టీ ఇచ్చేవాడి అమాయకత్వాన్ని బట్టి ఎన్ని కారణాలైనా సృష్ఠించుకోవచ్చు. సంవత్సరానికి అయిదు రూపాయిల నలభైఅయిదు పైసలు హైక్ రావటం దగ్గర్నించి ... పక్కింటి కుక్కపిల్ల నరేష్‌గాడితో లేచిపోయేవరకు ..కాదేది పార్టీకి అనర్హం(ఇక్కడ కుక్కపిల్లకు వేరే అర్థాలు ఏమీలేవు.కుక్కపిల్ల అనే చదవండి).ఇక venue..ఎవడో ఒక బ్యాచిలర్ బక్రాగాడి రూం ఉంటుంది.

ఒక గ్యాంగ్‌ మందు పార్టీలో కూర్చుంది అంటే అందులో పలు రకాల జీవులుంటాయి. ఉదాహరణకు:
సూపర్ సీనియర్ తాగుబోతులు : వీళ్లు మందుని మంచినీళ్లలా తాగేస్తారు.ఒకవేళ మందులోకి మనం నీళ్లు కలపాలని ట్రై చేసినా సున్నితంగా తిరస్కరిస్తుంటారు.వీళ్లకు ఎంత తాగాలో తెలుసు.కాని అంతకంటే ఎక్కువే తాగుతుంటారు.
సీనియర్ తాగుబోతులు : వీళ్లు అందరికి పెగ్గు కలుపుతూ మిగతా వారికి తెలీకుండా మధ్యలో raw తాగేస్తుంటారు. వీళ్లకు కూడా ఎంత తాగాలో తెలుసు and అంతే తాగుతుంటారు. Next
ఫ్రెషర్ తాగుబోతులు : వీళ్లు మూత మందులోకి అర లీటర్ థమ్స్అప్ కలుపుకొని, పక్కవాడి మొహం మీద నాలుగు చుక్కలు తీర్థంలా చల్లి..ఒక్క సిప్ తాగి "బాగా స్ట్రాంగ్‌గా ఉంది రా".."అబ్బా!! ఎక్కేసింది రా" లాంటి రెండు మూడు డైలాగ్స్ తడబడుతూ చెప్తుంటారు..వీళ్లకు ఎంత తాగాలో తెలియదు. కాకపోతే కాసేపయ్యాక కరుణానిధి కళ్లద్దాలు తీసేసినట్టు, జయలలిత రింగ రింగ పాటకు డ్యాన్స్ చేసినట్టు, కన్నడ సినిమా హీరో అందంగా ఉన్నట్టు..మొగలిరేకులు సీరియల్ అయిపోయినట్టు ..ఇలా ప్రకృతి విరుద్ధమైన అలోచనలు మనసులోకి రాగానే వాళ్లకు అర్థం అవుతుంది ఇక తాగటం ఆపాలని.
ఇక నాలుగో రకం.. వీరు మందు తాగకుండా తాగుబోతు ఎదవలు చేసే ఆగడాలను..ఆక్రుత్యాలను..అరాచకాలను చూసి ఆనందిస్తూ..అడగకపోయినా ఐస్ అందిస్తూ..వీలైతే వీడియో తీస్తూ ఉంటారు.ఇక పార్టీలో ఎలాగూ పాలు(బీరు)పంచుకోవాలి కాబట్టి, వీళ్లు గ్లాసులో కూల్‌డ్రింక్ పోసుకొని నీళ్లు కూడా కలుపుకోకుండా తాగేస్తుంటారు. వీళ్లతో కొంచం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే "నా పక్క క్యూబికల్ అమ్మాయి కత్తిలా ఉందిరా" అని తాగిన మత్తులో మీరన్న మాటలను రికార్డ్ చేసి, మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

ఇక అసలు పార్టీలోకి వెళ్తే.. మొదటి రౌండ్ చాలా ప్రశాంతంగా సాగిపోతుంది..రెండో రౌండ్లో .. హైక్ రాని ఓ తాగుబోతు మేనేజర్‌ని అమ్మనా బూతులూ తిట్టటంతో అసలు రచ్చ మొదలౌతుంది...మేనేజర్ ఎవడికైనా మేనేజరే కాబట్టి మిగతా వాళ్లు కూడా రెండు మూడు బూతులు సాయం అందిస్తారు.ఆ తర్వాత ఎవడి మేనేజర్ అందరికంటే పెద్ద ఎదవ అని కాసేపు తీవ్రమైన వాగ్వివాదం చేసుకుంటూ, మిరపకాయ బజ్జీలు, చిప్సు ఒకరి మీద ఒకరు విసురుకుని నిరసన తెలుపుతారు. చివరకు ఒక సూపర్ సీనియర్ తాగుబోతు కలగజేసుకుని, ఎవరో ఒక మేనేజర్‌ కించపరచటం మంచిది కాదు అని భావించి, అందరి మేనేజర్లకు సమానమైన మార్కులు వేస్తాడు.దీంతో బాటిల్ మూతలను గాల్లోకి ఎగరేసి హర్షం వ్యక్తం చేస్తూ అందరూ మళ్లీ పార్టీలోకి దిగుతారు.

ఇలా ఆఫీస్ రాజకీయాలను కాసేపు కూలంకషంగా చర్చించాక డిస్కషన్ రకరకాల మలుపులు తిరుగుతుంది.... సానియ మీర్జా షోయబ్ మాలిక్‌ని ఎందుకు పెళ్లి చేసుకుంది.. recentగా విడుదలైన "స్మశానంలో సరిగమపదని" అనే సినిమా ఎన్ని సెంటర్స్‌లో వంద రోజులు ఆడుతుంది... తమిళ్ హీరో విజయ్‌కాంత్ మనిషా కాదా...మొదలగు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతకటానికి ట్రై చేస్తారు.(పాఠకులకు quiz:ఆ చివరి ప్రశ్నకు క్రింది ఫోటో చూసి సమాధానం చెప్పటానికి ట్రై చెయ్యండి).

ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు బిజీ హీరో తారకరత్న , మాజీ హోం మంత్రి జానా రెడ్డిలాంటి మేధావులు మాత్రమే సమాధానాలను ఇవ్వగలరు అని డిసైడ్ అయ్యి next పెగ్గు వేసుకుంటారు.

ఇలా డిస్కషన్ ఎన్ని మలుపులు తిరిగినా చివరకు ఒక కామన్ పాయింట్ దగ్గర ఆగిపోతుంది.... ప్రేమ. ఖచ్చితంగా గ్యాంగ్‌లో ఒక భగ్నప్రేమికుడు, ఓ కన్వర్టెడ్ ప్రేమికుడు (అదేనండీ , పెళ్లయ్యాక భార్యని ప్రేమిస్తుంటాడుగా ..ఆ టైప్) మరియు ఓ ఫ్రెషర్ ప్రేమికుడు ఉంటాడు. ఇక చూస్కో నాసామిరంగా , వినేవాడు KCR అయితే బాలక్రిష్ణ bungee jump చేశాడు అని చెప్పాడంట వెనకటికి ఎవడో. ఆ లెక్కన, వీళ్లందరు మన ఫ్రెషర్ ప్రేమికుడి చుట్టూ కూర్చుని కృష్ణుడు భగవద్గీత బోధించినట్టు 5.1 సరౌండ్ సిస్టంలో జ్ఞానోదయం చేస్తుంటారు(నరేష్‌గాడు నములుతున్న కుర్‌కురె సౌండుని ఈ సీన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు).వాడికి జ్ఞానోదయం అవుతుందో లేదో తెలియదుగానీ వీళ్ల భాగవతం అయ్యేసరికి మందు మాత్రం ఖాళీ అయిపోతుంది.ఏది ఏమైనా ఆ సలహాలన్ని వింటే జీవితం సంకనాకిపోతుందని చెప్పేవాడికీ తెలుసు, వినేవాడికి కూడా తెలుసు.

ఇలా ఆఖరి పెగ్గు అయ్యేసరికి conversation ఈ క్రింది విధంగా ఉంటుంది (ఇక్కడ సరదాగా కొన్ని పేర్లు వాడుతున్నాను.వీళ్లకు నాకు ఎటువంటి సంబంధం లేదు.వీళ్లు నా ఫ్రెండ్స్ అని మీరు అస్సలు అనుకోకూడదు) :


ప్రతాప్: "ఏరా ఏం తిందాం?"


రవి: “అవును నిజమేరా.. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిండకూడదు”

మహేష్: "వీళ్లిద్దరికీ బాగా ఎక్కిందిరా" అని వికటాట్టహాసం చేస్తూ చికెన్ ముక్క అనుకొని నాలుగోవాడి వేలు కొరుకుతుంటాడు.

నాలుగోవాడు నరేష్‌గాడని నేను చెప్పాలనుకోవట్లేదు.ఒకవేళ చెప్పిన మీరు నమ్మకూడదు. సరేనా ?

ఈ తతంగమంతా అయిపోయాకా,ప్రొద్దున లేచి చూస్తే ఎవడు బాత్‌రూంలో పడుకున్నాడు..ఎవడు బెడ్‌రూంలో ఉన్నాడు..ఎవడు సోఫా కిందనుంచి వస్తున్నాడు అన్న విషయం మాత్రమే గమనించాల్సి ఉంటుంది.

తాగండి... కాకపోతే ప్రొద్దున్నే లేచి బ్రష్ చేసుకునేప్పుడు బ్రష్ మీద షేవింగ్ క్రీం కాకుండా టూత్‌పేస్ట్ మాత్రమే వేసుకోగలను అన్న నమ్మకం ఉంటేనే తాగండి And పొరపాటున కూడా తాగి డ్రైవ్ చెయ్యకండి. మీ ప్రాణాలు మీ ఇష్టం. కానీ మీతో ముడిపడిన జీవితాలు కొన్ని ఉంటాయని మర్చిపోకండి.

Jul 8, 2010

Media.... Dare to....

గమనిక: ఇది నేను మరో బ్లాగ్‌లో రాసిన పోస్ట్. అందరూ చదివితే బాగుంటుంది అనిపించింది. అందుకే ఇంగ్లీష్‌లో ఉన్నా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

Disclaimer: Well, I googled for “Disclaimer” and it read something like this.. Law a statement denying knowledge of something”. So whatever s*** I talk, u r not supposed to shout out. And therz nothing humorous in this post. Keep away if you are xpecting one.

I respect media and adore them for bringing out the truth. Unfortunately, I have to think twice when I try to repeat the same statement by prefixing media with the word Indian. Doesn’t matter what the medium is.. Print, Television, Web…. Really vexed up with the coverage they give to unnecessary news. In fact, we can’t even call it a news but rather the media creates news out of anything.

Recently I saw an article on a so called Andhra website with a tag line Dare to Write. The title of the article read “Ramesh Prasad’s Angry With Rajamouli?”.(Don’t worry abt who Prasad or Rajamouli is, keep in mind they are high profile celebrities.) Fine… for any layman like me, it sounds as if there might be some misunderstanding between Ramesh Prasad and Rajamouli and the question mark at the end indicates that these website guys are doubtful abt the reason behind that. Great… now read this article…

It is natural to wonder why the soft spoken, reserved, controversy free head of Prasad groups, Ramesh Prasad is very furious with Rajamouli.

Well, if a person as important as the heart to the group is being sent away, who would not be furious. There is no one in the industry who doesn’t know about Nagineedu, the man who works in Prasad Labs. The work of the Hyderabad unit happens under the monitoring of Nagineedu and it is heard that his only desire in life is to become an actor. Nagineedu is a distant relative to Ramesh Prasad. Though he has the urge to act, it is heard that due to the hectic work at the Labs, he has been killing his desire. However, he did act in one Tamil film and it is now said that Rajamouli saw that and roped in Nagineedu for an important character in his new film ‘Maryada Ramanna’.

Though Sunil’s character is titled ‘Ram’, the buzz is that Nagineedu has got the title character. Doing a small role in Rajamouli film is a great recognition so one can imagine what happens when one does a title role. So, the chances are that Nagineedu might get quite busy with offers once ‘Maryada Ramanna’ releases.(wow!!.. wat an optimistic media) This will compel him to move out of the Prasad Labs and definitely, Ramesh Prasad cannot get another Nagineedu in a short span.

That’s why, many are talking that though he may not express his displeasure in open, he would surely be miffed with Rajamouli from inside.

Hell with that question mark… these guys actually concluded that Mr Prasad would surely be miffed with Rajamouli. The film is not released yet, no one knows the potential of Nagineedu as an actor, doesn’t know if his character gets the recognition, doesn’t know if he really be flooded with offers that he might get away from Prasad labs. But this f***ked up media reaches to a conclusion with some dumb logical explanation which always includes hell lot of mays and mights. Keep in mind that I’m not trying to promote or demote the film. Thatz a different ball game.

The same day I read another article about anchor Jhansi. If you watch telugu channels this is a fairly popular household name. The article titled “Jhansi’s 'Rendo Pelli' Soon?”(Jhansi’s second marriage soon). Fine… she has broke up with her husband long back and shez getting ready for a second marriage. Keeping aside if this is true or not, considering itz totally her personal life, what is the need to describe her body structure in the article. Thatz disgusting guys.

Now, this one is from a TV show.. a special show for Half an hour in prime time. “బోనీ కపూర్ పై విరుచుకుపడిన రాం గోపాల్ వర్మ”(Ram Gopal Varma is furious about Boney Kapoor)…..well, the only mistake RGV has done is to express his feelings about Sridevi in his personal blog. An excerpt from his blog:

So, straight from her super stardom and magazine covers and her dazzling beauty on the silver screen, I saw her in Boney’s house serving tea like an ordinary housewife. I hated Boney Kapoor for bringing that angel from heaven down to being just an ordinary housewife.

And quoting the above paragraph this channel was confident enuf to say that RGV is not at all happy with Boney Kapoor because hez not allowing Sridevi to act. Perfect. And this lasted for half an hour with the anchor providing as many (il)logical reasons as possible to prove the statement authentic. Awesome!! And obviously they never mentioned the previous line - The woman who the men of the entire nation desired was suddenly left all alone in the world till Boney Kapoor stepped in to fill the vacuum.

I can quote hell lot of such examples. But I was just wondering, don’t you think the soul purpose of media is to bring out the truth and infuse some social awareness among people? Or may be I’m dumb enuf to think like that. Jai ho… media.

Not over yet. I wud like to bore u some more by pointing this quotes for u.

“We can't quite decide if the world is growing worse, or if the media is just working harder at it.”

“The media no longer ask those who know something to share that knowledge with the public. Instead they ask those who know nothing to represent the ignorance of the public and, in so doing, to legitimate it.” – Anonymous (An example for this are the cricket reviews. Every damn channel has their own specialist panel who pour out their cricketing wisdom to us.)

“The public have an insatiable curiosity to know everything. Except what is worth knowing. Journalism, conscious of this, and having tradesman-like habits, supplies their demands.” --Oscar Wilde

“People everywhere confuse what they read in newspapers with news.” -- Abbott Joseph Liebling

So guys.. news is not always news. I-believe-what-I-see kinda stuff is long gone coz I guarantee you, media can manipulate even ur senses.

By the way… the title says.. Media.. Dare to.. complete the statement with some interesting stuffSep 21, 2009

చెప్పాల్సింది చాలా ఉంది.. చూడాల్సింది మిగిలే ఉంది

మాంచి నిద్రలో ఉన్నాను. మా అమ్మ ఫోన్‌లో వాళ్ల ఫ్రెండ్‌తో మాట్లాడుతోంది. సున్నుండలు చక్కెరతోనే చెయ్యాలా లేక బెల్లంతో కూడా చెయ్యొచ్చా అన్న ప్రజా సమస్యపై ఒక గంటసేపు కూలంకషంగా చర్చించి, అసలు ఈ రెండూ కాకుండా ఉప్పు, మిరియాల పొడి వేసి చేస్తే వెరైటీగా ఉంటుందని తీర్మానించి మా అమ్మ వంటకు ఉపక్రమించింది. ముంచుకొస్తున్న ముప్పును ముందే పసిగట్టిన నేను వెనక గోడ దూకి నరేష్‌గాడి ఇంటికి వెళ్లిపోయాను(పారిపోయాను).

నరేష్‌గాడు నోరెళ్లబెట్టుకుని TVవైపే తదేకంగా చూస్తున్నాడు. "ఏంట్రా అంత తీక్షణంగా చూస్తున్నావ్?" అని అడిగా. "అదేం లేదురా ఇందాక ఆ న్యూస్ ఛానల్ అమ్మాయి, 'చెప్పాల్సింది చాలా ఉంది.. చూడాల్సింది మిగిలే ఉంది' అని అదోలా అనింది. ఏం చూపిస్తుందో అని ఆశగా చూస్తున్నా" అని TVవైపే కన్నార్పకుండా చూస్తూ అన్నాడు. ఇంతలో ఆ అమ్మాయి వచ్చి, "చూసింది చాలు. నోటి చుట్టూ ఉన్న ఆ ద్రవాన్ని తుడుచుకుని, నోర్మూసుకుని న్యూస్ చూడండి" అని మర్యాదపూర్వకంగా చెప్పింది. "ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం" అని తనకు ఇచ్చిన పేపర్‌ని కన్‌ఫ్యూజింగా చూసి, "క్షమించండి" అని సర్దుకుని, "A వచ్చి B పై వాలినట్టు, B వచ్చి C పై వాలినట్టు అలాగే C వచ్చి D పై వాలినట్టు తెలిసింది. వీటిని చూసి అంకెలు కూడా ఒకదానిపై ఒకటి వాలినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం " అని ఇంకా ఏదో చెప్పబోగా, వెనకల్నించి న్యూస్ డైరెక్టర్ "కట్ ..కట్..ఎవడయ్యావాడు , ఆ మర్డర్ కేస్ గురించి న్యూస్ ఇవ్వమంటే లిరిక్స్ పేపర్ ఇచ్చాడు. అయినా నువ్వేంటమ్మా ఇంప్రొవైజ్ చెయ్యమన్నాం కదా అని పాటని కూడా న్యూస్ లాగా చదివేస్తే ఎలా." అని అరిచాడు.

ఈ న్యూస్‌ని TV లో చూసిన కరకాల సుభాకర్ , ఆ డైరెక్టర్ అన్న మాటలు వినకుండానే ఇదేదో సంచలన వార్తలాగా ఉంది అని డిసైడ్ అయిపోయి ETV3 లో ఘంటారావం ప్రోగ్రాం ప్రసారం మొదలుపెట్టేసాడు.చర్చకు నలుగురు ఉద్ధండులను కూర్చోబెట్టాడు.

"పిచ్చేశ్వర్రావ్‌గారు మీరు చెప్పండి, అసలు ఇలా A వచ్చి B పై వాలటానికి, B వచ్చి C పై వాలటానికి, అలాగే C వచ్చి D పై వాలటానికి గల కారణాలు ఏమయ్యుంటాయని మీరు భావిస్తున్నారు? ఇదంతా ఒక ఎత్తైతే, అంకెలు కూడా ఒకదానిపై ఒకటి వాలినట్టు మా ఇన్వెస్టిగేటివ్ టీం ద్వారా తెలిసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుత రాజకీయాలపై ఇది ఎటువంటి ప్రభావం చూపబోతోంది. అలాగే భారత్ పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దీనివల్ల దెబ్బతినే అవకాశాలేమైనా ఉన్నాయా ?ముఖ్యంగా సానియా మీర్జా ర్యాంకింగ్ మెరుగుపడే అవకాశం ఏమైనా ఉందా?"అంటూ ఈ విషయంతో సంబంధం ఉన్న అన్ని అంశాలపై ఒకేసారి ప్రశ్నలు సంధించాడు.

పిచ్చేశ్వర్రావ్‌గారికి ఏమి అర్థమైందోగాని పిచ్చి చూపులు చూస్తూ లేచి జేబులో ఉన్న చిన్న చీటీ తెరచి "ఇది ఖచ్చితంగా ప్రతిపక్షం పన్నిన కుట్ర. దీనికి బాధ్యత వహిస్తూ మాయావతి రాజీనామా చెయ్యాలి" అని అన్నారు.

వెంటనే పక్కనే ఉన్న తింగరమూర్తిగారు లేచి "అసలు ABCD లు కూడా రాని మా మీదా పాలకపక్షం వాళ్లు ఇలా నిందలు వెయ్యటం చాల హేయమైన చర్య. దీనికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడి రాజీనామా చెయ్యాలి" అని అన్నారు.

ఇంతలో కరకాల సుభాకర్ "మీరు ప్రజారాజ్యం పార్టీ గురించి మర్చిపోతున్నారు" అని అందించాడు.

వెంటనే మరొక ఉద్ధండులుగారు లేచి వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ చిరంజీవి రాజకీయాలనించి తప్పుకోవాలని డిమాండ్ చేసాడు.

కాసేపటికి స్టూడియోలో నాలుగు బాంబులు వేసుకుని, నాటు తుపాకులతో పేల్చుకుని, కత్తులతో ఒకరినొకరు పొడుచుకుని ఎంతో శాంతియుతంగా చర్చను ముగించారు. కరకాల సుభాకర్ ఎప్పటిలాగే చిరునవ్వు చిందిస్తూ "ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రేక్షకులందరికి ధన్యవాదాలు. రేపు మరొక ముఖ్యమైన అంశం గురించి చర్చించుకుందాం. సెలవు" అని కార్యక్రమాన్ని ముగించాడు.

వీటన్నిటి మధ్యలో మన నిరంతర వార్తా స్రవంతి TV8 లో 30 మినిట్స్ ప్రోగ్రాం మొదలైంది. "హలో!! నా పేరు స్వప్న. మీరు చూస్తున్నది TV8. ఇవాళ 30 మినిట్స్‌లో Clinic minus సమర్పించు "తీటా Juniors" ప్రోగ్రాంపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నాం. దీనిపై మరింత తాజా సమాచారం అందించటానికి తీటా Juniors స్టూడియోలో మా ప్రతినిధి కుక్కుటేష్ Live లో ఉన్నారు. కుక్కుటేష్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది?"

"స్వప్న!! ఇక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. మీరు చూసినట్టైతే , ఇక్కడ ప్రముఖ డ్యాన్సర్, విశ్వవిఖ్యాత మెంటర్ విద్యగారు యాంకర్ క్రీంకార్‌గారి వెంటపడుతున్నారు. విషయమేంటంటే , విద్యగారి గ్రూప్‌లోని డ్యాన్సర్ ఇరవయ్యెనిమిదిసార్లు ఎలిమినేట్ అయ్యి, ప్రేక్షకులు 545 SMSలు పంపించటంతో మళ్లీ వైల్డ్‌కార్డ్ ద్వారా షో లోకి ప్రవేశించింది.ఆ సంతోషం తట్టుకోలేక క్రీంకార్‌తో డ్యాన్స్ చెయ్యాలని డిస్కవరీ ఛానెల్‌లో ఆఫ్రికన్ దున్నపోతు జింకపిల్ల వెంటపడినట్టు, విద్య క్రీంకార్ వెంటపడుతోంది."

"మరిన్ని వివరాలు తెలపడానికి తీటా Juniors జడ్జ్ సుందరం మాష్టారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి , 90కేజీలతో నాజూగ్గా ఉండే విద్య 30కేజీలతో బలిష్టంగా ఉండే క్రీంకార్‌తో డ్యాన్స్ చెయ్యాలనుకోవటంపై మీ అభిప్రాయం ఏంటి? పైగా అందులో లిఫ్టింగ్ స్టెప్స్ ఉండాలని విద్యగారు కోరుకుంటున్నారట."
"super... suuuuper.. suuuuuuuuuuper ..." అని మెలికలు తిరిగిపోతూ అన్నారు సుందరం మాష్టారు.
"సార్!! అది కాదు .. మీ అభిప్రాయం.."
"super... suuuuper..."
"కాబట్టి స్వప్న, సుందరం మాష్టారు ఏం చెప్పదలుచుకున్నారో ప్రేక్షకులే అర్థం చేసుకోవాలి. "

ఎలాగో తెలీదు క్రీంకార్ డ్యాన్స్ చెయ్యటానికి ఒప్పుకున్నాడు. బొమ్మరిల్లు సినిమాలోని బొమ్మని గీస్తే నీలా ఉంది పాట మొదలైంది.

"క్రీంకార్ పరిస్థితి ఏమైందో బ్రేక్ తర్వాత తెలుసుకుందాం."

"బ్రేక్ తర్వాత 30 మినిట్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. కుక్కుటేష్ ఇంకా మనతోనే ఉన్నారు. కుక్కుటేష్ చెప్పండి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది?"

"స్వప్న!! ఇక్కడ మీరు చూసినట్టైతే ఇప్పుడే క్రీంకార్‌ని స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్నారు. పరిస్థితి ఏంటో మీకు ఈపాటికే అర్థం అయ్యింటుంది.
ఇదంతా చూసి ఇక్కడి ప్రేక్షకులు బొమ్మని గీస్తే లిరిక్స్‌ని ఈ క్రింది విధంగా మారిస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు."

"పందిని గీస్తే నీలా ఉంది...
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది..
సర్లె పాపం అని దగ్గరికెల్తే..
దాని బురదే నాపై చల్లింది...
ఆ కంపేదో నీకే ఇమ్మంది.."

కెమెరామ్యాన్ కపిలేష్‌తో కుక్కుటేష్ .. TV8 .. హైదరాబాద్ .

ఇలా న్యూస్ ఛానల్స్ చూస్తూ మా జనరల్ నాలెడ్జ్‌ని పెంచుకొంటుండగా కాసేపటికి నరేష్ వాళ్ల అమ్మగారు ఒక ప్లేట్ తీసుకుని వచ్చారు. "ఇదిగో బాబు వెరైటీగా ఉంటుందని ఉప్పు, మిరియాల పొడి వేసి సున్నుండలు చేశాను" అని అన్నారు. నరేష్‌గాడు నావైపు చూసి వికటాట్టహాసం చేస్తూ ఇందాక మా అమ్మ, మీ అమ్మ ఫోన్‌లో మాట్లాడుకున్నారు అని చావు కబురు చల్లగా చెప్పాడు.

Jul 14, 2009

హై .. హై.. హైక్

మేనేజర్ పిలిచింది. అసలే బ్రేక్ అవుట్ ఏరియాలో క్యారమ్స్ స్ట్రైకర్ కనిపించట్లేదని ఆఫీస్ లో అందరూ బాగా కంగారుగా ఉన్నాము. నరేష్ గాడిని అనుమానిద్దామా అంటే..వాడు మా కంపెనీ కాదు. అయ్యిందేదో అయ్యింది.. ఇక ఆడటం మానేసి,కొంచం కష్టమైనా సరే ఆఫీస్ పని చేద్దాం అని డిసైడ్ అయ్యి ఎవరి క్యుబికల్ కి వాళ్లు వెళ్లిపోయాం. ఇంతలో ఈవిడ పిలిచింది. అసలే రిసెషన్ ..ఏ బాంబు పేలుస్తుందో ఏమొ అని భయపడుతూ, లాప్ టాప్ wallpaperలో ఉన్న ఐశ్వర్యరాయ్ ఫోటోని, మొబైల్ wallpaperలో ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఫోటోని కళ్లకద్దుకుని మా మేనేజర్ దగ్గరికి వెళ్లాను.

"హాయ్ భరత్ !! Last year నీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడటానికి పిలిచాను. బాగా వర్క్ చేశావ్. ఇంకా బాగా వర్క్ చేయాలి. అలాగే నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి assertiveness..taking ownership..leadership skills..." అంటూ నాకు అర్థంకాని నాలుగైదు పదాలు చెప్పింది. చివరగా.."నీ పర్ఫార్మెన్స్ కి మెచ్చి కంపెనీ నీకు భారీగా హైక్ ఇచ్చింది." అని అంది.

అప్పటి వరకు చెప్పిన విషయాల్లో "భారీగా" అన్న మాట తప్ప నాకు ఇంకేదీ వినిపించలేదు. వెంటనే జేబులో ఉన్న ఆకు, వక్క తీసి మేనేజర్ ముందు పెట్టి, చేతిలో కర్పూరం వెలిగించి హారతి ఇచ్చాను. నా భక్తికి పరవశించిపోయి మా మేనేజర్ కళ్లనీళ్లు పెట్టుకుంటూ ఇదిగో నీకు వచ్చిన 0.01545% హైక్ అని ఒక ఎన్వలప్ చేతిలో పెట్టింది. నా చేతిలో వెలుగుతున్న కర్పూరం మేనేజర్ చేతిలోకి ట్రాన్స్‌ఫర్ చెయ్యటం.. మరో జేబులో ఉన్న కత్తి తీసి టేబుల్ మీద గుచ్చటం.. నేను టేబుల్ పైకి ఎక్కటం.. మూడూ ఒకేసారి జరిగాయి. ఎక్కిన వాడిని ఊరికే ఉండకుండా, ఆర్.నారాయణమూర్తి సినిమాలో సైడ్ డ్యాన్సర్స్‌లాగా పూనకం వచ్చినట్టు ఎగిరాను. దెబ్బకి మేనేజర్ టేబుల్ కింద దాక్కుంది. కాసేపటికి టేబుల్ కిందనుంచే తెల్ల ఖర్చీఫ్ ఊపుతూ , "భరత్!! పైనుంచి అంతే విదిల్చారు. నేను ఇంతకంటే ఏం చెయ్యలేను" అంటూ నేను ఇచ్చిన ఆకు, వక్క మళ్లీ నా చేతిలో పెట్టింది. ఇక చేసేదేమి లేక నా క్యుబికల్‌కి వచ్చేశాను.

అయినా నాలో నిద్రపోతున్న ఎర్ర సినిమా హీరో మేల్కొనడానికి కారణం నాకు తక్కువ హైక్ వచ్చినందుకు కాదు. ఎప్పుడూ వర్క్ ఫ్రం హోం చేస్తూ అప్పుడప్పుడు ఆఫీస్‌కి వచ్చి కష్టపడి క్యారమ్స్ ఆడుతూ వీలైనప్పుడు వర్క్ చేసే నాకంటే, రోజుకు 26 గంటలూ ఆఫీస్ పని మాత్రమే చేసే నా కొలీగ్ కి ఎక్కువగా .. అంటే 0.02406% ఇచ్చింది. ఆ అవమానాన్ని భరిస్తూ తనతో కలిసి పని చెయ్యటంకంటే పక్క టీంకి వెళ్లిపోవడం మంచిదనిపించింది. కాని ఆ టీంలో అందరూ రోజుకి 28 గంటలు ఆఫీస్ పని చేస్తారని తెలిసి నా ఆలోచనని వచ్చే రిలీజ్‌కి డిఫర్ చేసి ఇక ఈసారి ఎలాగైనా సరే నా కొలీగ్ ని అంతసేపు పనిచెయ్యించకూడదని ప్రతిజ్ణ చేశాను.

ఈ "భారీ" హైక్‌లతో ఆఫీస్ అంతా గందరగోలంగా ఉంది. డిప్రెషన్‌లో ఎవరికి తోచిన పని వాళ్లు చేస్తున్నారు. ఒకడు నెట్‌వర్క్ కేబుల్‌తో ఉరేసుకోవడానికి ట్రై చేస్తుంటే మరొకడు అంత కష్టం ఎందుకని కిందికెళ్లి కాంటీన్‌లో లెమన్ రైస్ తెచ్చుకున్నాడు.

ఇవన్నీ చూసి బెంగళూరులో నేను కొన్న "ఆత్మహత్యకు అరవై దారులు" పుస్తకం గుర్తొచ్చింది. అందులో కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకోవటానికి చిత్ర విచిత్రమైన దారులు ఇచ్చాడు. ఉదాహరణకి ,"బేగంపేట్ ఆనంద్ థియేటర్ దగ్గర రోడ్ క్రాస్ చెయ్యటం ద్వారా". ఇది మాత్రం నిజం. కావాలంటే అక్కడ ID కార్డ్స్ ని అడ్డంగా వేసుకొని తిరిగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని అడగండి(ఎవరో అర్థమైందనుకుంటా? :-)). మామూలుగా అక్కడ ఇటువైపునుంచి అటువైపుకు రోడ్ క్రాస్ చెయ్యటానికి పది నిమిషాలు పడుతుంది. అదే మాంచి పీక్ టైం లో అయితే అర్థగంటలో దాటెయ్యొచ్చు. విశేషమేంటంటే,అందమైన అమ్మాయితో కలిసి క్రాస్ చేస్తున్నారనుకోండి 100kmph స్పీడ్ లో వచ్చేవాడు 20kmphకి తగ్గించి అమ్మాయి దాటగానే మళ్లీ 100కి పెంచి, అమ్మాయికి చిన్న స్మైల్ ఇచ్చి, పనిలోపనిగా మనల్ని గుద్దేసి వెళ్లిపోతాడు. కాబట్టి .. ఈసారి మీ గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి అక్కడ రోడ్ క్రాస్ చెయ్యటానికి ట్రై చెయ్యండి. తను అందంగా ఉందో లేదో తెలిసిపోతుంది. ;-)

సరే సరే .. బ్యాక్ టు ఆఫీస్...ఈ గందరగోలంలో అనౌన్స్‌మెంట్ స్పీకర్‌నుంచి ఖతర్నాక్ సినిమాలోని "దోమ కుడితె చికన్ గునియా..ప్రేమ పుడితె సుఖంగునియ"అనే పాట మొదలైంది. ఈ పాట పెట్టారంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదం,భూకంపం కంటే పెను ప్రమాదం జరిగుంటుందని అందరికి అర్థమైంది. అంతే, బాలక్రిష్ణ సినిమా ఇంటర్వెల్‌లో గేట్లు తీసినప్పుడు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయినట్టు, ఆఫీసులో దిక్కుకొకరు పరుగెత్తారు. ఇదే కరెక్ట్ టైం అని సగం మంది బ్యాగు మొత్తం సర్దుకొని పరుగెత్తారు. ఆ సగం మందిలో నేను ఉన్నానో లేదో చెప్పుకోండి చూద్దాం?

కాసేపటికి పాట ఆగిపోయి మరో అనౌన్స్‌మెంట్ వచ్చింది. "క్షమించాలి.. ఇందాక మీరు అలర్ట్‌గా ఉన్నారో లేదో టెస్ట్ చెయ్యటానికి ఆ పాట పెట్టాము. ఎవరి పనులు వారు చేసుకోవచ్చు." . హమ్మయ్య.. దాసరి నారాయణరావు స్పీచ్ ఇస్తున్నప్పుడు కరెంట్ పోతే కలిగే అమితానందం అందరి ముఖంలో కనిపించింది.( పాట పెట్టిన వాడిని ఆ తర్వాత బయటకు లాగి చితకబాదారు.. అది వేరే విషయం..)

అయినా బ్యాగు సర్దుకొన్న తర్వాత కూడా మళ్లీ వెనక్కు వెళ్లి ఆఫీస్‌లో కూర్చునేంత అమాయకుడిని కాదు నేను. అందుకే, సర్దుకొన్న బ్యాగు సంకలో పెట్టుకొని ఇంటికెళ్లిపోతున్నా.. వర్క్ ఫ్రం హోం చెయ్యటానికి.. ఉంటా :-)

Jun 22, 2009

స..రి..గ..మ..ప..

బ్లాగ్ రాసి చాలా రోజులైంది. కొంచెం బిజీగా ఉన్నాను. అంటే.. నిజంగానే బిజీగా ఉన్నాను. సరే మరి ఏ విషయం గురించి రాద్దాం అని ఆలోచిస్తుండగా ఇవాళ (Jun 21st) ప్రపంచ సంగీత దినోత్సవం అని తెలిసింది.అంతే .. నాలో నిద్రపోతున్న కళాకారుడిని, మొహమ్మీద బకెట్ నీళ్లు పోసి లేపాను. ఇక లేచిన వాడు ఊరికే ఉండక ఇలా బ్లాగు రాసి మీ మీదకు వదులుతున్నాడు. విషయమేంటంటే, నాకు ఇష్టమైన కొన్ని పాటలు, అందులో నచ్చిన లిరిక్స్ గురించి వ్రాయాలనుకుంటున్నాను. మీకు ఓపిక ఉంటే చదవండి.

గమనిక: ఇందులో ఎక్కువగా సిరివెన్నెలగారి పాటలే ఉంటాయి మరియు విరహ గీతాలు ఎక్కువగా ఉంటాయి. మరొక విషయం .. ఇవి నాకు ఇష్టమైన పాటలు. మీకు నచ్చొచ్చు నచ్చకపోవొచ్చు.

1.పాట: కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు
సినిమా: నువ్వేకావాలి
రచయిత: సిరివెన్నెల
" 'మనం' అన్నది ఒకే మాటని నాకిన్నాళ్లు తెలుసు. నువ్వూ నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు ఉంది మనసు " . ఒకరిలో ఒకరిగా కలిసిపోయిన ప్రాణస్నేహితులు విడిపోతుంటే వచ్చే ఈ పాటవిన్న ప్రతిసారి నా కళ్లలో నీళ్లు వస్తాయి.

2. పాట: నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైన.
సినిమా: బొమ్మరిళ్లు
రచయిత: సిరివెన్నెల
"నా వెనువెంట నీవే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా" ... ఈ లిరిక్స్ విన్నప్పుడు నాకు నేను గుర్తొస్తాను.మరొకరికి కూడా నేను గుర్తొస్తాను .

మరీ ఏడుపు పాటలు ఉన్నట్టున్నాయి కదా. కాసేపు ట్రెండ్ మారుద్దాం.

3. పాట: ఏమంటారో నాకు నీకున్న ఇదినీ .
సినిమా: గుడుంబా శంకర్
రచయిత:
చంద్రబోస్
"ఇష్ట కష్టాలని ఇపుడేమంటారో.. ఈ మోహమాటాలని మరి ఏమంటారో
స్వల్ప భారాలని ఇపుడేమంటారో.. సమీప దూరాలని అసలేమంటారో" .. ఇలా మొదటి చరణం లో ఏమంటారో అంటూ ప్రేమ గురించి చెప్తే.. రెండో చరణం లో
"నాలొ నువ్వునీ.. ఇక నీలో నేనునీ ..
మాకే మేమనీ మన దారే మనదనీ" అంటూ పెళ్లి గురించి చెప్తాడు.

4. పాట: ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా .
సినిమా: చక్రం
రచయిత: సిరివెన్నెల
"నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం..
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం" ... నువు లేనిదే నేను లేనని మీ ప్రేయసికి ఇంతకంటే అందంగా ఎలా చెప్పగలరు..

5. పాట: గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి .
సినిమా: డాడీ
రచయిత: సిరివెన్నెల
"నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేనో.. ఎవరినెవరు లాలిస్తున్నారో" తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ప్రేమను ఇంత అందంగా సిరివెన్నెలగారే చెప్పగలరు.

6. పాట: ఎగిరే.. ఎగిరే .
సినిమా: కొంచెం ఇష్టం కొంచెం కష్టం
రచయిత: చంద్రబోస్
"ఈ క్షణమే సంబరం..ఈ క్షణమే శాశ్వతం.. ఈ క్షణమే జీవితం.. తెలిసిందీ ఈ క్షణం " ... ఇందులో నచ్చటానికి ఏముంది అనుకుంటున్నారా.. ఒకసారి ఆ పాట చూడండి.. సినిమాలో అప్పటి వరకు రిజర్వ్డ్ గా ఉన్న హీరోయిన్ .."ఈ క్షణమే జీవితం.. తెలిసిందీ ఈ క్షణం" అని రాగానే.. గొడుగు విసిరేసి వర్షం లో తడుస్తూ అందరితో కలిసిపోతుంది. లిరిక్స్ కి తగినట్టు పాట తీయడం.. అలా తీయగలిగేటట్టు పాట వ్రాయటం నాకు నచ్చింది.

7. పాట: కళ్లలోన నువ్వు..గుండెల్లోన నువ్వు.
సినిమా: నా ప్రాణంకంటే ఎక్కువ (ఈ సినిమా పేరు కూడా చాలా మంది విని ఉండరు.)
రచయిత: శశి ప్రీతం
"ఈ జన్మకు నువు కాదంటే .. వచ్చే జన్మన్నా.. అది కూడా నువు కాదంటే.. జన్మను వద్దన్నా".. లవ్ ఫెయిల్ అయిన వాళ్ల కోసం చాలా పాటలు వచ్చాయి.. అందులో ఇదీ ఒకటి... అలాగే ఈ సినిమాలో "నిన్నే చూశాక" అని సునీత పాడిన పాట కూడా బాగుంటుంది..

8. పాట: కిట కిట తలుపులు ...
సినిమా: మనసంతా నువ్వే
రచయిత: సిరివెన్నెల
"కంట తడి నాడూ నేడు... చెంప తడిమిందీ చూడు.. చెమ్మలో ఎదో తేడా కనిపించలేదా?".. ప్రేమికులు విడీపోయేప్పుడు వచ్చే కన్నీటిని.. మళ్లీ కలిసినప్పుడు వచ్చే ఆనందభాష్పాలనీ .. ' చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా? ' అంటూ ఒకే వ్యాఖ్యం లో చెప్పడం చాలా చాలా నచ్చింది.

9. పాట: చిట్టి నడుమునే చూస్తున్నా ...
సినిమా: గుడుంబా శంకర్
రచయిత: సిరివెన్నెల
ఈ పాటలో అంతా బాగుంటుంది. ఎక్కడా ద్వంద్వార్థాలు లేకుండా .."నిను నిమరకా నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి" .. అంటూ అమ్మాయి నడుము వర్ణించటం సిరివెన్నెలగారికే సాధ్యం.

10. పాట: మనోహరా ...
సినిమా: చెలి
రచయిత: భువనచంద్ర
ఈ పాట లేకుండా నా లిస్ట్ పూర్తవదు. ఇందులో చెప్పుకోవటానికి అద్భుతమైన లిరిక్స్ ఏం లేవు. కానీ, హారిస్ జయరాజ్ సంగీతం .. Bombay జయశ్రీ గానం ... డబ్బింగ్ సినిమా అయినప్పటికీ భువనచంద్రగారు రాసిన మంచి వ్యాఖ్యాలు.. ఇవన్నీ కలిసి నాకు ఈ పాట అంటే ఇష్టమయ్యేలా
చేశాయి.

ఇవి కొన్ని పాటలే.. ఇలా ఎన్నైనా రాస్తూ ఉండొచ్చు. ఇప్పటికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి.. ఇక నుంచి నాకు బోర్ కొట్టినప్పుడంతా మరికొన్ని పాటల గురించి రాస్తుంటాను.. ఈ పోస్ట్ మీకు నచ్చితే.. ఇందులో చెప్పిన పాటలన్నీ మళ్లీ మళ్లీ వినండి. నచ్చకపోతే ఖతర్నాక్ సినిమాలోని "దోమ కుడితె చికన్ గునియా..ప్రేమ పుడితె సుఖంగునియ" అనే పాట ఒకసారి వినండి.. చచ్చూరుకుంటారు.. సెలవు. ఇందులో అచ్చుతప్పులుంటే మన్నించండి.

Jan 22, 2009

"ఆత్మహత్యకు అరవై దారులు" ... సరదాగా

హెచ్చరిక:నేను రాసే ప్రతి టపా కి ఒక హెచ్చరిక ఉంటుంది. అందుకనే "హెచ్చరిక " అని మొదలుపెట్టాను. కాని, విషయమేంటంటె ఇందులో హెచ్చరించటానికి ఏమి లేదు. పొద్దుపోక రాస్తున్నాను.. అంతే.

మొన్నామధ్య టీవీలో ప్రముఖ రాజకీయవేత్త,బహుభాషాకోవిధుడు అయిన నందమూరి తారకరత్న(ఎవరో తెలుసుగా?) ఇంటర్వ్యూ వచ్చింది. అందులో వ్యాఖ్యాత అడిగే ప్రశ్నలకి వీడి తలతిక్క సమాధానాలు విని ఆత్మహత్యకు సులువైన మార్గం ఏమిటి అనే ఆలోచన వచ్చింది. నాకెలాగూ ప్రాక్తికల్ గా చేసుకొనే ధైర్యం లేదు కాబట్టి విషయంలో రెగులర్ గా ప్రాక్టీస్ చేసే, ఇప్పటికే రెండుమూడుసార్లు ట్రై చేసిన మా నరేష్ గాడితో ఒకసారి మాట్లాడటానికి నిర్ణయించుకున్నాను. నరేష్ గాడి విషయం వచ్చింది కాబట్టి వాడు ఎందుకు సూసైడ్ కి ట్రై చేసాడో తెలుసుకుందాం. ఎలా చేశాడు అనేది నాకు కూడా తెలియని రహస్యం.

మొదటి ప్రయత్నం : మా నరేష్ గాడు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే మిస్స్డ్ కాల్ ఇస్తాడు. కొంచెం అర్జెంట్ అయితే రెండు సార్లు మిస్స్డ్ కాల్ ఇస్తాడు. ఇక మరీ ముఖ్యమైన విషయమైతే ఎదుటివాళ్లు కాల్ చేసేవరకు మిస్స్డ్ కాల్స్ ఇస్తూనే ఉంటాడు. అలాంటిది ఒకసారి వాడు నాకు కాల్ చేసినపుడు పొరపాటున లిఫ్ట్ చేసేసా. అంతే, మా వాడి గుండె పగిలిపోయింది. కోపం,బాధ , ఫ్రస్ట్రేషన్. ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలీక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

రెండో ప్రయత్నం : మా బీటెక్ లొ కోమల అనే ఒక కసక్కు ఉండేది.(
ఒరేయ్.. తప్పురా. లెక్చరర్ ని కత్తి.. కసక్కు .. అనకూడదు) ఆమెను చూసి మా నరేష్ గాడు మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆమె పాఠం చెప్తుంటే మా వాడు ఎప్పుడు 45 deg యాంగిల్ లోకూర్చుని లైన్ వేసేవాడు( ఎందుకలా ... అని అడక్కండి. అదంతే ). అలా కొంతకాలం గడిచాక ఇక ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యి, మదనపల్లె పెద్ద మసీద్ దగ్గర కొన్న అత్తరు పూసుకొని శివాలయం స్వామి దగ్గర 5:45కి ముహుర్తం పెట్టించుకుని సైకిల్ లో కోమల ఇంటికి బయల్దేరాడు. కాని, దారిలో కోమల రజనిల్ రాజ్ అనే గొట్టం గాడి చేతిలో చెయ్యివేసి వెళ్లటం చూసి( లెక్చరర్ ని గొట్టం అనటం కూడా తప్పే ) నరేష్ గాడి గుండె మళ్ళీ పగిలింది. పక్కనే ఉన్న పంక్చర్ షాప్ లో గుండెకి ఒక పాచ్ వేయించుకుని, సైకిల్ని హాఫ్ రేట్ కి అమ్మేసి మా వాడు అస్తమిస్తున్నసూర్యుడి వైపు అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే నరేష్ గాడి జీవితం లో ఎన్నో విషాదగాథలు మరెన్నో గుండెల్ని పిండేసే సందర్భాలు. ఇలా జరిగిన ప్రతీసారి మా వాడు సూసైడ్ కి ట్రై చెయ్యటం అది మిస్సవ్వటం మామూలే. కాకపొతే విషయంలో నేనైనా సక్సస్ అవుతానేమొ చూద్దామని ఎలా ట్రై చేస్తున్నాడో తెలుసుకోవటానికి నేనే వాడికి కాల్ చేశాను(" నేనే వాడికి కాల్చేశాను "... ఇది ఒత్తి పలకండి).

ట్రింగ్... ట్రింగ్...
హలో !! రేయ్ రవిగా ఎలా ఉన్నావ్?
నీయబ్బ.. నేను రా భరత్ ని.
ఓహ్.. నువ్వా. ఇందాక రవిగాడికి మిస్డ్ కాల్ ఇచ్చా ... వాడేనేమొ అనుకున్నా.
!@$%$% .. సర్లే కాని, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా.
ఓహ్.. కంగ్రాట్స్. ఎన్నోసారి?
నీ.... నేను నీలాగ కాదురా.
సరే ..సరే.. అలా ఐతే నువ్వు " ఆత్మహత్యకు అరవై దారులు" అనే పుస్తకం చదువు. నేను కూడా అందులో ఉన్నవే ట్రై చేస్తుంటా.
అందుకేనా ఇంకా ఉన్నావు.
అలా కాదురా.. నాకు పనిచెయ్యలేదు నీకు పని చేస్తుందేమో చూడు.
సరేలే ... నేను ట్రై చేస్తా.
గుడ్... అలాగే నీకు దారి పనిచేసిందో నాకు కాల్ చేసి చెప్పు.
ఒరేయ్ !@$%$%... పెట్రా ఫోను.

సరే.. ఇక పుస్తకం పేరు తెలిసింది కాబట్టి,అందులో ఏముందో తెలుసుకుందామని అది కొనటానికి బెంగుళూరు లో సెకండ్హ్యాండ్ పుస్తకాలు దొరికే అవెన్యూ రోడ్ కి వెళ్లా. ఒక షాప్ కి వెళ్లి అడిగా..

బాబు!! " ఆత్మహత్యకు అరవై దారులు" అనే పుస్తకం ఉందా ?
మీరు సాఫ్ట్ వేర్ ఇంజనీరా?
?????????
అంటే.. మధ్య వాళ్లే పుస్తకాన్ని ఎక్కువగా అడుగుతున్నారు.అందుకే అడిగాను . ఇదిగోండి పుస్తకం.
ఛీ! ఎదవ బతుకు అని మనసులో అనుకుని, నేనేం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని కాదు. ఇంతకీ పుస్తకంలో ఉన్న దారులు పనిచేస్తాయా? ఏదైనా ఫీడ్ బ్యాక్ చూసి కొనటం నాకు అలవాటు. సక్సస్ ఫుల్ గా సూసైడ్ చేసుకున్నవాళ్లు ఎవరైనా ఇందులో ఫీడ్ బ్యాక్ ఇచ్చారా? అని అడిగా.
వాడు నా వైపు విచిత్రంగా చూసి వెకిళిగా నవ్వాడు.(
"ఒరేయ్ తింగరోడా!! సక్సస్ ఫుల్ గా సూసైడ్ చేసుకున్నవాళ్లు ఫీడ్ బ్యాక్ ఎలా ఇస్తార్రా?" అన్న భావం వాడి నవ్వులో కనిపించింది ) నిజం చెప్పండి సార్ మీరు సాఫ్ట్ వేర్ ఇంజనీరే కదా? అని మళ్లీ అడిగాడు.
ఇక దాచటం కష్టమనిపించి, " అవును" అని చెప్పి పుస్తకం లాక్కొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాను.

ఇంతకీ.. పుస్తకంలో ఏముంది? ప్చ్.. ఏమో ఇపుడు చదివే ఓపిక నాకు లేదు. అది తీరిగ్గా చదివి నెక్స్ట్ టపాలో చెప్తా. అంతవరకు సెలవు. మరచిపోయా.. నరేష్ గాడు పార్టీకి పిలిచాడు, వాడి గురించి ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు.