Sep 21, 2009

చెప్పాల్సింది చాలా ఉంది.. చూడాల్సింది మిగిలే ఉంది

మాంచి నిద్రలో ఉన్నాను. మా అమ్మ ఫోన్‌లో వాళ్ల ఫ్రెండ్‌తో మాట్లాడుతోంది. సున్నుండలు చక్కెరతోనే చెయ్యాలా లేక బెల్లంతో కూడా చెయ్యొచ్చా అన్న ప్రజా సమస్యపై ఒక గంటసేపు కూలంకషంగా చర్చించి, అసలు ఈ రెండూ కాకుండా ఉప్పు, మిరియాల పొడి వేసి చేస్తే వెరైటీగా ఉంటుందని తీర్మానించి మా అమ్మ వంటకు ఉపక్రమించింది. ముంచుకొస్తున్న ముప్పును ముందే పసిగట్టిన నేను వెనక గోడ దూకి నరేష్‌గాడి ఇంటికి వెళ్లిపోయాను(పారిపోయాను).

నరేష్‌గాడు నోరెళ్లబెట్టుకుని TVవైపే తదేకంగా చూస్తున్నాడు. "ఏంట్రా అంత తీక్షణంగా చూస్తున్నావ్?" అని అడిగా. "అదేం లేదురా ఇందాక ఆ న్యూస్ ఛానల్ అమ్మాయి, 'చెప్పాల్సింది చాలా ఉంది.. చూడాల్సింది మిగిలే ఉంది' అని అదోలా అనింది. ఏం చూపిస్తుందో అని ఆశగా చూస్తున్నా" అని TVవైపే కన్నార్పకుండా చూస్తూ అన్నాడు. ఇంతలో ఆ అమ్మాయి వచ్చి, "చూసింది చాలు. నోటి చుట్టూ ఉన్న ఆ ద్రవాన్ని తుడుచుకుని, నోర్మూసుకుని న్యూస్ చూడండి" అని మర్యాదపూర్వకంగా చెప్పింది. "ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం" అని తనకు ఇచ్చిన పేపర్‌ని కన్‌ఫ్యూజింగా చూసి, "క్షమించండి" అని సర్దుకుని, "A వచ్చి B పై వాలినట్టు, B వచ్చి C పై వాలినట్టు అలాగే C వచ్చి D పై వాలినట్టు తెలిసింది. వీటిని చూసి అంకెలు కూడా ఒకదానిపై ఒకటి వాలినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం " అని ఇంకా ఏదో చెప్పబోగా, వెనకల్నించి న్యూస్ డైరెక్టర్ "కట్ ..కట్..ఎవడయ్యావాడు , ఆ మర్డర్ కేస్ గురించి న్యూస్ ఇవ్వమంటే లిరిక్స్ పేపర్ ఇచ్చాడు. అయినా నువ్వేంటమ్మా ఇంప్రొవైజ్ చెయ్యమన్నాం కదా అని పాటని కూడా న్యూస్ లాగా చదివేస్తే ఎలా." అని అరిచాడు.

ఈ న్యూస్‌ని TV లో చూసిన కరకాల సుభాకర్ , ఆ డైరెక్టర్ అన్న మాటలు వినకుండానే ఇదేదో సంచలన వార్తలాగా ఉంది అని డిసైడ్ అయిపోయి ETV3 లో ఘంటారావం ప్రోగ్రాం ప్రసారం మొదలుపెట్టేసాడు.చర్చకు నలుగురు ఉద్ధండులను కూర్చోబెట్టాడు.

"పిచ్చేశ్వర్రావ్‌గారు మీరు చెప్పండి, అసలు ఇలా A వచ్చి B పై వాలటానికి, B వచ్చి C పై వాలటానికి, అలాగే C వచ్చి D పై వాలటానికి గల కారణాలు ఏమయ్యుంటాయని మీరు భావిస్తున్నారు? ఇదంతా ఒక ఎత్తైతే, అంకెలు కూడా ఒకదానిపై ఒకటి వాలినట్టు మా ఇన్వెస్టిగేటివ్ టీం ద్వారా తెలిసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుత రాజకీయాలపై ఇది ఎటువంటి ప్రభావం చూపబోతోంది. అలాగే భారత్ పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దీనివల్ల దెబ్బతినే అవకాశాలేమైనా ఉన్నాయా ?ముఖ్యంగా సానియా మీర్జా ర్యాంకింగ్ మెరుగుపడే అవకాశం ఏమైనా ఉందా?"అంటూ ఈ విషయంతో సంబంధం ఉన్న అన్ని అంశాలపై ఒకేసారి ప్రశ్నలు సంధించాడు.

పిచ్చేశ్వర్రావ్‌గారికి ఏమి అర్థమైందోగాని పిచ్చి చూపులు చూస్తూ లేచి జేబులో ఉన్న చిన్న చీటీ తెరచి "ఇది ఖచ్చితంగా ప్రతిపక్షం పన్నిన కుట్ర. దీనికి బాధ్యత వహిస్తూ మాయావతి రాజీనామా చెయ్యాలి" అని అన్నారు.

వెంటనే పక్కనే ఉన్న తింగరమూర్తిగారు లేచి "అసలు ABCD లు కూడా రాని మా మీదా పాలకపక్షం వాళ్లు ఇలా నిందలు వెయ్యటం చాల హేయమైన చర్య. దీనికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడి రాజీనామా చెయ్యాలి" అని అన్నారు.

ఇంతలో కరకాల సుభాకర్ "మీరు ప్రజారాజ్యం పార్టీ గురించి మర్చిపోతున్నారు" అని అందించాడు.

వెంటనే మరొక ఉద్ధండులుగారు లేచి వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ చిరంజీవి రాజకీయాలనించి తప్పుకోవాలని డిమాండ్ చేసాడు.

కాసేపటికి స్టూడియోలో నాలుగు బాంబులు వేసుకుని, నాటు తుపాకులతో పేల్చుకుని, కత్తులతో ఒకరినొకరు పొడుచుకుని ఎంతో శాంతియుతంగా చర్చను ముగించారు. కరకాల సుభాకర్ ఎప్పటిలాగే చిరునవ్వు చిందిస్తూ "ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రేక్షకులందరికి ధన్యవాదాలు. రేపు మరొక ముఖ్యమైన అంశం గురించి చర్చించుకుందాం. సెలవు" అని కార్యక్రమాన్ని ముగించాడు.

వీటన్నిటి మధ్యలో మన నిరంతర వార్తా స్రవంతి TV8 లో 30 మినిట్స్ ప్రోగ్రాం మొదలైంది. "హలో!! నా పేరు స్వప్న. మీరు చూస్తున్నది TV8. ఇవాళ 30 మినిట్స్‌లో Clinic minus సమర్పించు "తీటా Juniors" ప్రోగ్రాంపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నాం. దీనిపై మరింత తాజా సమాచారం అందించటానికి తీటా Juniors స్టూడియోలో మా ప్రతినిధి కుక్కుటేష్ Live లో ఉన్నారు. కుక్కుటేష్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది?"

"స్వప్న!! ఇక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. మీరు చూసినట్టైతే , ఇక్కడ ప్రముఖ డ్యాన్సర్, విశ్వవిఖ్యాత మెంటర్ విద్యగారు యాంకర్ క్రీంకార్‌గారి వెంటపడుతున్నారు. విషయమేంటంటే , విద్యగారి గ్రూప్‌లోని డ్యాన్సర్ ఇరవయ్యెనిమిదిసార్లు ఎలిమినేట్ అయ్యి, ప్రేక్షకులు 545 SMSలు పంపించటంతో మళ్లీ వైల్డ్‌కార్డ్ ద్వారా షో లోకి ప్రవేశించింది.ఆ సంతోషం తట్టుకోలేక క్రీంకార్‌తో డ్యాన్స్ చెయ్యాలని డిస్కవరీ ఛానెల్‌లో ఆఫ్రికన్ దున్నపోతు జింకపిల్ల వెంటపడినట్టు, విద్య క్రీంకార్ వెంటపడుతోంది."

"మరిన్ని వివరాలు తెలపడానికి తీటా Juniors జడ్జ్ సుందరం మాష్టారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి , 90కేజీలతో నాజూగ్గా ఉండే విద్య 30కేజీలతో బలిష్టంగా ఉండే క్రీంకార్‌తో డ్యాన్స్ చెయ్యాలనుకోవటంపై మీ అభిప్రాయం ఏంటి? పైగా అందులో లిఫ్టింగ్ స్టెప్స్ ఉండాలని విద్యగారు కోరుకుంటున్నారట."
"super... suuuuper.. suuuuuuuuuuper ..." అని మెలికలు తిరిగిపోతూ అన్నారు సుందరం మాష్టారు.
"సార్!! అది కాదు .. మీ అభిప్రాయం.."
"super... suuuuper..."
"కాబట్టి స్వప్న, సుందరం మాష్టారు ఏం చెప్పదలుచుకున్నారో ప్రేక్షకులే అర్థం చేసుకోవాలి. "

ఎలాగో తెలీదు క్రీంకార్ డ్యాన్స్ చెయ్యటానికి ఒప్పుకున్నాడు. బొమ్మరిల్లు సినిమాలోని బొమ్మని గీస్తే నీలా ఉంది పాట మొదలైంది.

"క్రీంకార్ పరిస్థితి ఏమైందో బ్రేక్ తర్వాత తెలుసుకుందాం."

"బ్రేక్ తర్వాత 30 మినిట్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. కుక్కుటేష్ ఇంకా మనతోనే ఉన్నారు. కుక్కుటేష్ చెప్పండి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది?"

"స్వప్న!! ఇక్కడ మీరు చూసినట్టైతే ఇప్పుడే క్రీంకార్‌ని స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్నారు. పరిస్థితి ఏంటో మీకు ఈపాటికే అర్థం అయ్యింటుంది.
ఇదంతా చూసి ఇక్కడి ప్రేక్షకులు బొమ్మని గీస్తే లిరిక్స్‌ని ఈ క్రింది విధంగా మారిస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు."

"పందిని గీస్తే నీలా ఉంది...
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది..
సర్లె పాపం అని దగ్గరికెల్తే..
దాని బురదే నాపై చల్లింది...
ఆ కంపేదో నీకే ఇమ్మంది.."

కెమెరామ్యాన్ కపిలేష్‌తో కుక్కుటేష్ .. TV8 .. హైదరాబాద్ .

ఇలా న్యూస్ ఛానల్స్ చూస్తూ మా జనరల్ నాలెడ్జ్‌ని పెంచుకొంటుండగా కాసేపటికి నరేష్ వాళ్ల అమ్మగారు ఒక ప్లేట్ తీసుకుని వచ్చారు. "ఇదిగో బాబు వెరైటీగా ఉంటుందని ఉప్పు, మిరియాల పొడి వేసి సున్నుండలు చేశాను" అని అన్నారు. నరేష్‌గాడు నావైపు చూసి వికటాట్టహాసం చేస్తూ ఇందాక మా అమ్మ, మీ అమ్మ ఫోన్‌లో మాట్లాడుకున్నారు అని చావు కబురు చల్లగా చెప్పాడు.

8 comments:

  1. Really superb ! You made my day :)

    ReplyDelete
  2. హ హ హ :) చాల చాల బాగుంది !
    కరకాల సుభాకర్ >> ఈయన ఇంకా ETV3 లో ఘంటారావం ప్రోగ్రాం చేస్తున్నాడా?
    ఇంతకీ క్రీంకార్‌ పరిస్థితి ఏమైందో :) :)

    ReplyDelete
  3. thnx sravya gaaru... ledandi aayani ippudu NTV lo unnadanukuntaa..

    ReplyDelete
  4. బాగు౦ది.
    టి.వీ చుస్తే నా మీద నాకే జాలేస్తు౦ది.అ౦దుకే మానేశాను.చుడాలి అనుకు౦టే సప్తగిరి చుస్తున్నా. అన్ని చానల్స్ లోని "ది బేస్ట్ "అనుకొ౦డి.

    ReplyDelete
  5. Hey Enti Bharah new try aa..! Wonderful ga vundi.. chaala malupulu .. vunaye... Chaala baavundi..!

    Looking fwd to c more.!
    -Mvk

    ReplyDelete
  6. Hi Bharath,

    Nice one....nee basha loo cheppalantee.....

    super... suuuuper.. suuuuuuuuuuper

    inthakiii Anu atha cheyyaleda....Miriyaala Sunnundalu??

    Rgds
    Shilpa

    ReplyDelete
  7. Thnx @ subhadragaaru, MVK, pothukurru gaaru, shilpa

    @shilpa .. miriyaala sunnundalu neekey parcel chesaa :)

    ReplyDelete