Sep 21, 2009

చెప్పాల్సింది చాలా ఉంది.. చూడాల్సింది మిగిలే ఉంది

మాంచి నిద్రలో ఉన్నాను. మా అమ్మ ఫోన్‌లో వాళ్ల ఫ్రెండ్‌తో మాట్లాడుతోంది. సున్నుండలు చక్కెరతోనే చెయ్యాలా లేక బెల్లంతో కూడా చెయ్యొచ్చా అన్న ప్రజా సమస్యపై ఒక గంటసేపు కూలంకషంగా చర్చించి, అసలు ఈ రెండూ కాకుండా ఉప్పు, మిరియాల పొడి వేసి చేస్తే వెరైటీగా ఉంటుందని తీర్మానించి మా అమ్మ వంటకు ఉపక్రమించింది. ముంచుకొస్తున్న ముప్పును ముందే పసిగట్టిన నేను వెనక గోడ దూకి నరేష్‌గాడి ఇంటికి వెళ్లిపోయాను(పారిపోయాను).

నరేష్‌గాడు నోరెళ్లబెట్టుకుని TVవైపే తదేకంగా చూస్తున్నాడు. "ఏంట్రా అంత తీక్షణంగా చూస్తున్నావ్?" అని అడిగా. "అదేం లేదురా ఇందాక ఆ న్యూస్ ఛానల్ అమ్మాయి, 'చెప్పాల్సింది చాలా ఉంది.. చూడాల్సింది మిగిలే ఉంది' అని అదోలా అనింది. ఏం చూపిస్తుందో అని ఆశగా చూస్తున్నా" అని TVవైపే కన్నార్పకుండా చూస్తూ అన్నాడు. ఇంతలో ఆ అమ్మాయి వచ్చి, "చూసింది చాలు. నోటి చుట్టూ ఉన్న ఆ ద్రవాన్ని తుడుచుకుని, నోర్మూసుకుని న్యూస్ చూడండి" అని మర్యాదపూర్వకంగా చెప్పింది. "ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం" అని తనకు ఇచ్చిన పేపర్‌ని కన్‌ఫ్యూజింగా చూసి, "క్షమించండి" అని సర్దుకుని, "A వచ్చి B పై వాలినట్టు, B వచ్చి C పై వాలినట్టు అలాగే C వచ్చి D పై వాలినట్టు తెలిసింది. వీటిని చూసి అంకెలు కూడా ఒకదానిపై ఒకటి వాలినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం " అని ఇంకా ఏదో చెప్పబోగా, వెనకల్నించి న్యూస్ డైరెక్టర్ "కట్ ..కట్..ఎవడయ్యావాడు , ఆ మర్డర్ కేస్ గురించి న్యూస్ ఇవ్వమంటే లిరిక్స్ పేపర్ ఇచ్చాడు. అయినా నువ్వేంటమ్మా ఇంప్రొవైజ్ చెయ్యమన్నాం కదా అని పాటని కూడా న్యూస్ లాగా చదివేస్తే ఎలా." అని అరిచాడు.

ఈ న్యూస్‌ని TV లో చూసిన కరకాల సుభాకర్ , ఆ డైరెక్టర్ అన్న మాటలు వినకుండానే ఇదేదో సంచలన వార్తలాగా ఉంది అని డిసైడ్ అయిపోయి ETV3 లో ఘంటారావం ప్రోగ్రాం ప్రసారం మొదలుపెట్టేసాడు.చర్చకు నలుగురు ఉద్ధండులను కూర్చోబెట్టాడు.

"పిచ్చేశ్వర్రావ్‌గారు మీరు చెప్పండి, అసలు ఇలా A వచ్చి B పై వాలటానికి, B వచ్చి C పై వాలటానికి, అలాగే C వచ్చి D పై వాలటానికి గల కారణాలు ఏమయ్యుంటాయని మీరు భావిస్తున్నారు? ఇదంతా ఒక ఎత్తైతే, అంకెలు కూడా ఒకదానిపై ఒకటి వాలినట్టు మా ఇన్వెస్టిగేటివ్ టీం ద్వారా తెలిసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుత రాజకీయాలపై ఇది ఎటువంటి ప్రభావం చూపబోతోంది. అలాగే భారత్ పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దీనివల్ల దెబ్బతినే అవకాశాలేమైనా ఉన్నాయా ?ముఖ్యంగా సానియా మీర్జా ర్యాంకింగ్ మెరుగుపడే అవకాశం ఏమైనా ఉందా?"అంటూ ఈ విషయంతో సంబంధం ఉన్న అన్ని అంశాలపై ఒకేసారి ప్రశ్నలు సంధించాడు.

పిచ్చేశ్వర్రావ్‌గారికి ఏమి అర్థమైందోగాని పిచ్చి చూపులు చూస్తూ లేచి జేబులో ఉన్న చిన్న చీటీ తెరచి "ఇది ఖచ్చితంగా ప్రతిపక్షం పన్నిన కుట్ర. దీనికి బాధ్యత వహిస్తూ మాయావతి రాజీనామా చెయ్యాలి" అని అన్నారు.

వెంటనే పక్కనే ఉన్న తింగరమూర్తిగారు లేచి "అసలు ABCD లు కూడా రాని మా మీదా పాలకపక్షం వాళ్లు ఇలా నిందలు వెయ్యటం చాల హేయమైన చర్య. దీనికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడి రాజీనామా చెయ్యాలి" అని అన్నారు.

ఇంతలో కరకాల సుభాకర్ "మీరు ప్రజారాజ్యం పార్టీ గురించి మర్చిపోతున్నారు" అని అందించాడు.

వెంటనే మరొక ఉద్ధండులుగారు లేచి వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ చిరంజీవి రాజకీయాలనించి తప్పుకోవాలని డిమాండ్ చేసాడు.

కాసేపటికి స్టూడియోలో నాలుగు బాంబులు వేసుకుని, నాటు తుపాకులతో పేల్చుకుని, కత్తులతో ఒకరినొకరు పొడుచుకుని ఎంతో శాంతియుతంగా చర్చను ముగించారు. కరకాల సుభాకర్ ఎప్పటిలాగే చిరునవ్వు చిందిస్తూ "ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రేక్షకులందరికి ధన్యవాదాలు. రేపు మరొక ముఖ్యమైన అంశం గురించి చర్చించుకుందాం. సెలవు" అని కార్యక్రమాన్ని ముగించాడు.

వీటన్నిటి మధ్యలో మన నిరంతర వార్తా స్రవంతి TV8 లో 30 మినిట్స్ ప్రోగ్రాం మొదలైంది. "హలో!! నా పేరు స్వప్న. మీరు చూస్తున్నది TV8. ఇవాళ 30 మినిట్స్‌లో Clinic minus సమర్పించు "తీటా Juniors" ప్రోగ్రాంపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నాం. దీనిపై మరింత తాజా సమాచారం అందించటానికి తీటా Juniors స్టూడియోలో మా ప్రతినిధి కుక్కుటేష్ Live లో ఉన్నారు. కుక్కుటేష్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది?"

"స్వప్న!! ఇక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. మీరు చూసినట్టైతే , ఇక్కడ ప్రముఖ డ్యాన్సర్, విశ్వవిఖ్యాత మెంటర్ విద్యగారు యాంకర్ క్రీంకార్‌గారి వెంటపడుతున్నారు. విషయమేంటంటే , విద్యగారి గ్రూప్‌లోని డ్యాన్సర్ ఇరవయ్యెనిమిదిసార్లు ఎలిమినేట్ అయ్యి, ప్రేక్షకులు 545 SMSలు పంపించటంతో మళ్లీ వైల్డ్‌కార్డ్ ద్వారా షో లోకి ప్రవేశించింది.ఆ సంతోషం తట్టుకోలేక క్రీంకార్‌తో డ్యాన్స్ చెయ్యాలని డిస్కవరీ ఛానెల్‌లో ఆఫ్రికన్ దున్నపోతు జింకపిల్ల వెంటపడినట్టు, విద్య క్రీంకార్ వెంటపడుతోంది."

"మరిన్ని వివరాలు తెలపడానికి తీటా Juniors జడ్జ్ సుందరం మాష్టారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి , 90కేజీలతో నాజూగ్గా ఉండే విద్య 30కేజీలతో బలిష్టంగా ఉండే క్రీంకార్‌తో డ్యాన్స్ చెయ్యాలనుకోవటంపై మీ అభిప్రాయం ఏంటి? పైగా అందులో లిఫ్టింగ్ స్టెప్స్ ఉండాలని విద్యగారు కోరుకుంటున్నారట."
"super... suuuuper.. suuuuuuuuuuper ..." అని మెలికలు తిరిగిపోతూ అన్నారు సుందరం మాష్టారు.
"సార్!! అది కాదు .. మీ అభిప్రాయం.."
"super... suuuuper..."
"కాబట్టి స్వప్న, సుందరం మాష్టారు ఏం చెప్పదలుచుకున్నారో ప్రేక్షకులే అర్థం చేసుకోవాలి. "

ఎలాగో తెలీదు క్రీంకార్ డ్యాన్స్ చెయ్యటానికి ఒప్పుకున్నాడు. బొమ్మరిల్లు సినిమాలోని బొమ్మని గీస్తే నీలా ఉంది పాట మొదలైంది.

"క్రీంకార్ పరిస్థితి ఏమైందో బ్రేక్ తర్వాత తెలుసుకుందాం."

"బ్రేక్ తర్వాత 30 మినిట్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. కుక్కుటేష్ ఇంకా మనతోనే ఉన్నారు. కుక్కుటేష్ చెప్పండి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది?"

"స్వప్న!! ఇక్కడ మీరు చూసినట్టైతే ఇప్పుడే క్రీంకార్‌ని స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్నారు. పరిస్థితి ఏంటో మీకు ఈపాటికే అర్థం అయ్యింటుంది.
ఇదంతా చూసి ఇక్కడి ప్రేక్షకులు బొమ్మని గీస్తే లిరిక్స్‌ని ఈ క్రింది విధంగా మారిస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు."

"పందిని గీస్తే నీలా ఉంది...
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది..
సర్లె పాపం అని దగ్గరికెల్తే..
దాని బురదే నాపై చల్లింది...
ఆ కంపేదో నీకే ఇమ్మంది.."

కెమెరామ్యాన్ కపిలేష్‌తో కుక్కుటేష్ .. TV8 .. హైదరాబాద్ .

ఇలా న్యూస్ ఛానల్స్ చూస్తూ మా జనరల్ నాలెడ్జ్‌ని పెంచుకొంటుండగా కాసేపటికి నరేష్ వాళ్ల అమ్మగారు ఒక ప్లేట్ తీసుకుని వచ్చారు. "ఇదిగో బాబు వెరైటీగా ఉంటుందని ఉప్పు, మిరియాల పొడి వేసి సున్నుండలు చేశాను" అని అన్నారు. నరేష్‌గాడు నావైపు చూసి వికటాట్టహాసం చేస్తూ ఇందాక మా అమ్మ, మీ అమ్మ ఫోన్‌లో మాట్లాడుకున్నారు అని చావు కబురు చల్లగా చెప్పాడు.

Jul 14, 2009

హై .. హై.. హైక్

మేనేజర్ పిలిచింది. అసలే బ్రేక్ అవుట్ ఏరియాలో క్యారమ్స్ స్ట్రైకర్ కనిపించట్లేదని ఆఫీస్ లో అందరూ బాగా కంగారుగా ఉన్నాము. నరేష్ గాడిని అనుమానిద్దామా అంటే..వాడు మా కంపెనీ కాదు. అయ్యిందేదో అయ్యింది.. ఇక ఆడటం మానేసి,కొంచం కష్టమైనా సరే ఆఫీస్ పని చేద్దాం అని డిసైడ్ అయ్యి ఎవరి క్యుబికల్ కి వాళ్లు వెళ్లిపోయాం. ఇంతలో ఈవిడ పిలిచింది. అసలే రిసెషన్ ..ఏ బాంబు పేలుస్తుందో ఏమొ అని భయపడుతూ, లాప్ టాప్ wallpaperలో ఉన్న ఐశ్వర్యరాయ్ ఫోటోని, మొబైల్ wallpaperలో ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఫోటోని కళ్లకద్దుకుని మా మేనేజర్ దగ్గరికి వెళ్లాను.

"హాయ్ భరత్ !! Last year నీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడటానికి పిలిచాను. బాగా వర్క్ చేశావ్. ఇంకా బాగా వర్క్ చేయాలి. అలాగే నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి assertiveness..taking ownership..leadership skills..." అంటూ నాకు అర్థంకాని నాలుగైదు పదాలు చెప్పింది. చివరగా.."నీ పర్ఫార్మెన్స్ కి మెచ్చి కంపెనీ నీకు భారీగా హైక్ ఇచ్చింది." అని అంది.

అప్పటి వరకు చెప్పిన విషయాల్లో "భారీగా" అన్న మాట తప్ప నాకు ఇంకేదీ వినిపించలేదు. వెంటనే జేబులో ఉన్న ఆకు, వక్క తీసి మేనేజర్ ముందు పెట్టి, చేతిలో కర్పూరం వెలిగించి హారతి ఇచ్చాను. నా భక్తికి పరవశించిపోయి మా మేనేజర్ కళ్లనీళ్లు పెట్టుకుంటూ ఇదిగో నీకు వచ్చిన 0.01545% హైక్ అని ఒక ఎన్వలప్ చేతిలో పెట్టింది. నా చేతిలో వెలుగుతున్న కర్పూరం మేనేజర్ చేతిలోకి ట్రాన్స్‌ఫర్ చెయ్యటం.. మరో జేబులో ఉన్న కత్తి తీసి టేబుల్ మీద గుచ్చటం.. నేను టేబుల్ పైకి ఎక్కటం.. మూడూ ఒకేసారి జరిగాయి. ఎక్కిన వాడిని ఊరికే ఉండకుండా, ఆర్.నారాయణమూర్తి సినిమాలో సైడ్ డ్యాన్సర్స్‌లాగా పూనకం వచ్చినట్టు ఎగిరాను. దెబ్బకి మేనేజర్ టేబుల్ కింద దాక్కుంది. కాసేపటికి టేబుల్ కిందనుంచే తెల్ల ఖర్చీఫ్ ఊపుతూ , "భరత్!! పైనుంచి అంతే విదిల్చారు. నేను ఇంతకంటే ఏం చెయ్యలేను" అంటూ నేను ఇచ్చిన ఆకు, వక్క మళ్లీ నా చేతిలో పెట్టింది. ఇక చేసేదేమి లేక నా క్యుబికల్‌కి వచ్చేశాను.

అయినా నాలో నిద్రపోతున్న ఎర్ర సినిమా హీరో మేల్కొనడానికి కారణం నాకు తక్కువ హైక్ వచ్చినందుకు కాదు. ఎప్పుడూ వర్క్ ఫ్రం హోం చేస్తూ అప్పుడప్పుడు ఆఫీస్‌కి వచ్చి కష్టపడి క్యారమ్స్ ఆడుతూ వీలైనప్పుడు వర్క్ చేసే నాకంటే, రోజుకు 26 గంటలూ ఆఫీస్ పని మాత్రమే చేసే నా కొలీగ్ కి ఎక్కువగా .. అంటే 0.02406% ఇచ్చింది. ఆ అవమానాన్ని భరిస్తూ తనతో కలిసి పని చెయ్యటంకంటే పక్క టీంకి వెళ్లిపోవడం మంచిదనిపించింది. కాని ఆ టీంలో అందరూ రోజుకి 28 గంటలు ఆఫీస్ పని చేస్తారని తెలిసి నా ఆలోచనని వచ్చే రిలీజ్‌కి డిఫర్ చేసి ఇక ఈసారి ఎలాగైనా సరే నా కొలీగ్ ని అంతసేపు పనిచెయ్యించకూడదని ప్రతిజ్ణ చేశాను.

ఈ "భారీ" హైక్‌లతో ఆఫీస్ అంతా గందరగోలంగా ఉంది. డిప్రెషన్‌లో ఎవరికి తోచిన పని వాళ్లు చేస్తున్నారు. ఒకడు నెట్‌వర్క్ కేబుల్‌తో ఉరేసుకోవడానికి ట్రై చేస్తుంటే మరొకడు అంత కష్టం ఎందుకని కిందికెళ్లి కాంటీన్‌లో లెమన్ రైస్ తెచ్చుకున్నాడు.

ఇవన్నీ చూసి బెంగళూరులో నేను కొన్న "ఆత్మహత్యకు అరవై దారులు" పుస్తకం గుర్తొచ్చింది. అందులో కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకోవటానికి చిత్ర విచిత్రమైన దారులు ఇచ్చాడు. ఉదాహరణకి ,"బేగంపేట్ ఆనంద్ థియేటర్ దగ్గర రోడ్ క్రాస్ చెయ్యటం ద్వారా". ఇది మాత్రం నిజం. కావాలంటే అక్కడ ID కార్డ్స్ ని అడ్డంగా వేసుకొని తిరిగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని అడగండి(ఎవరో అర్థమైందనుకుంటా? :-)). మామూలుగా అక్కడ ఇటువైపునుంచి అటువైపుకు రోడ్ క్రాస్ చెయ్యటానికి పది నిమిషాలు పడుతుంది. అదే మాంచి పీక్ టైం లో అయితే అర్థగంటలో దాటెయ్యొచ్చు. విశేషమేంటంటే,అందమైన అమ్మాయితో కలిసి క్రాస్ చేస్తున్నారనుకోండి 100kmph స్పీడ్ లో వచ్చేవాడు 20kmphకి తగ్గించి అమ్మాయి దాటగానే మళ్లీ 100కి పెంచి, అమ్మాయికి చిన్న స్మైల్ ఇచ్చి, పనిలోపనిగా మనల్ని గుద్దేసి వెళ్లిపోతాడు. కాబట్టి .. ఈసారి మీ గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి అక్కడ రోడ్ క్రాస్ చెయ్యటానికి ట్రై చెయ్యండి. తను అందంగా ఉందో లేదో తెలిసిపోతుంది. ;-)

సరే సరే .. బ్యాక్ టు ఆఫీస్...ఈ గందరగోలంలో అనౌన్స్‌మెంట్ స్పీకర్‌నుంచి ఖతర్నాక్ సినిమాలోని "దోమ కుడితె చికన్ గునియా..ప్రేమ పుడితె సుఖంగునియ"అనే పాట మొదలైంది. ఈ పాట పెట్టారంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదం,భూకంపం కంటే పెను ప్రమాదం జరిగుంటుందని అందరికి అర్థమైంది. అంతే, బాలక్రిష్ణ సినిమా ఇంటర్వెల్‌లో గేట్లు తీసినప్పుడు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయినట్టు, ఆఫీసులో దిక్కుకొకరు పరుగెత్తారు. ఇదే కరెక్ట్ టైం అని సగం మంది బ్యాగు మొత్తం సర్దుకొని పరుగెత్తారు. ఆ సగం మందిలో నేను ఉన్నానో లేదో చెప్పుకోండి చూద్దాం?

కాసేపటికి పాట ఆగిపోయి మరో అనౌన్స్‌మెంట్ వచ్చింది. "క్షమించాలి.. ఇందాక మీరు అలర్ట్‌గా ఉన్నారో లేదో టెస్ట్ చెయ్యటానికి ఆ పాట పెట్టాము. ఎవరి పనులు వారు చేసుకోవచ్చు." . హమ్మయ్య.. దాసరి నారాయణరావు స్పీచ్ ఇస్తున్నప్పుడు కరెంట్ పోతే కలిగే అమితానందం అందరి ముఖంలో కనిపించింది.( పాట పెట్టిన వాడిని ఆ తర్వాత బయటకు లాగి చితకబాదారు.. అది వేరే విషయం..)

అయినా బ్యాగు సర్దుకొన్న తర్వాత కూడా మళ్లీ వెనక్కు వెళ్లి ఆఫీస్‌లో కూర్చునేంత అమాయకుడిని కాదు నేను. అందుకే, సర్దుకొన్న బ్యాగు సంకలో పెట్టుకొని ఇంటికెళ్లిపోతున్నా.. వర్క్ ఫ్రం హోం చెయ్యటానికి.. ఉంటా :-)

Jun 22, 2009

స..రి..గ..మ..ప..

బ్లాగ్ రాసి చాలా రోజులైంది. కొంచెం బిజీగా ఉన్నాను. అంటే.. నిజంగానే బిజీగా ఉన్నాను. సరే మరి ఏ విషయం గురించి రాద్దాం అని ఆలోచిస్తుండగా ఇవాళ (Jun 21st) ప్రపంచ సంగీత దినోత్సవం అని తెలిసింది.అంతే .. నాలో నిద్రపోతున్న కళాకారుడిని, మొహమ్మీద బకెట్ నీళ్లు పోసి లేపాను. ఇక లేచిన వాడు ఊరికే ఉండక ఇలా బ్లాగు రాసి మీ మీదకు వదులుతున్నాడు. విషయమేంటంటే, నాకు ఇష్టమైన కొన్ని పాటలు, అందులో నచ్చిన లిరిక్స్ గురించి వ్రాయాలనుకుంటున్నాను. మీకు ఓపిక ఉంటే చదవండి.

గమనిక: ఇందులో ఎక్కువగా సిరివెన్నెలగారి పాటలే ఉంటాయి మరియు విరహ గీతాలు ఎక్కువగా ఉంటాయి. మరొక విషయం .. ఇవి నాకు ఇష్టమైన పాటలు. మీకు నచ్చొచ్చు నచ్చకపోవొచ్చు.

1.పాట: కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు
సినిమా: నువ్వేకావాలి
రచయిత: సిరివెన్నెల
" 'మనం' అన్నది ఒకే మాటని నాకిన్నాళ్లు తెలుసు. నువ్వూ నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు ఉంది మనసు " . ఒకరిలో ఒకరిగా కలిసిపోయిన ప్రాణస్నేహితులు విడిపోతుంటే వచ్చే ఈ పాటవిన్న ప్రతిసారి నా కళ్లలో నీళ్లు వస్తాయి.

2. పాట: నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైన.
సినిమా: బొమ్మరిళ్లు
రచయిత: సిరివెన్నెల
"నా వెనువెంట నీవే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా" ... ఈ లిరిక్స్ విన్నప్పుడు నాకు నేను గుర్తొస్తాను.మరొకరికి కూడా నేను గుర్తొస్తాను .

మరీ ఏడుపు పాటలు ఉన్నట్టున్నాయి కదా. కాసేపు ట్రెండ్ మారుద్దాం.

3. పాట: ఏమంటారో నాకు నీకున్న ఇదినీ .
సినిమా: గుడుంబా శంకర్
రచయిత:
చంద్రబోస్
"ఇష్ట కష్టాలని ఇపుడేమంటారో.. ఈ మోహమాటాలని మరి ఏమంటారో
స్వల్ప భారాలని ఇపుడేమంటారో.. సమీప దూరాలని అసలేమంటారో" .. ఇలా మొదటి చరణం లో ఏమంటారో అంటూ ప్రేమ గురించి చెప్తే.. రెండో చరణం లో
"నాలొ నువ్వునీ.. ఇక నీలో నేనునీ ..
మాకే మేమనీ మన దారే మనదనీ" అంటూ పెళ్లి గురించి చెప్తాడు.

4. పాట: ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా .
సినిమా: చక్రం
రచయిత: సిరివెన్నెల
"నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం..
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం" ... నువు లేనిదే నేను లేనని మీ ప్రేయసికి ఇంతకంటే అందంగా ఎలా చెప్పగలరు..

5. పాట: గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి .
సినిమా: డాడీ
రచయిత: సిరివెన్నెల
"నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేనో.. ఎవరినెవరు లాలిస్తున్నారో" తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ప్రేమను ఇంత అందంగా సిరివెన్నెలగారే చెప్పగలరు.

6. పాట: ఎగిరే.. ఎగిరే .
సినిమా: కొంచెం ఇష్టం కొంచెం కష్టం
రచయిత: చంద్రబోస్
"ఈ క్షణమే సంబరం..ఈ క్షణమే శాశ్వతం.. ఈ క్షణమే జీవితం.. తెలిసిందీ ఈ క్షణం " ... ఇందులో నచ్చటానికి ఏముంది అనుకుంటున్నారా.. ఒకసారి ఆ పాట చూడండి.. సినిమాలో అప్పటి వరకు రిజర్వ్డ్ గా ఉన్న హీరోయిన్ .."ఈ క్షణమే జీవితం.. తెలిసిందీ ఈ క్షణం" అని రాగానే.. గొడుగు విసిరేసి వర్షం లో తడుస్తూ అందరితో కలిసిపోతుంది. లిరిక్స్ కి తగినట్టు పాట తీయడం.. అలా తీయగలిగేటట్టు పాట వ్రాయటం నాకు నచ్చింది.

7. పాట: కళ్లలోన నువ్వు..గుండెల్లోన నువ్వు.
సినిమా: నా ప్రాణంకంటే ఎక్కువ (ఈ సినిమా పేరు కూడా చాలా మంది విని ఉండరు.)
రచయిత: శశి ప్రీతం
"ఈ జన్మకు నువు కాదంటే .. వచ్చే జన్మన్నా.. అది కూడా నువు కాదంటే.. జన్మను వద్దన్నా".. లవ్ ఫెయిల్ అయిన వాళ్ల కోసం చాలా పాటలు వచ్చాయి.. అందులో ఇదీ ఒకటి... అలాగే ఈ సినిమాలో "నిన్నే చూశాక" అని సునీత పాడిన పాట కూడా బాగుంటుంది..

8. పాట: కిట కిట తలుపులు ...
సినిమా: మనసంతా నువ్వే
రచయిత: సిరివెన్నెల
"కంట తడి నాడూ నేడు... చెంప తడిమిందీ చూడు.. చెమ్మలో ఎదో తేడా కనిపించలేదా?".. ప్రేమికులు విడీపోయేప్పుడు వచ్చే కన్నీటిని.. మళ్లీ కలిసినప్పుడు వచ్చే ఆనందభాష్పాలనీ .. ' చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా? ' అంటూ ఒకే వ్యాఖ్యం లో చెప్పడం చాలా చాలా నచ్చింది.

9. పాట: చిట్టి నడుమునే చూస్తున్నా ...
సినిమా: గుడుంబా శంకర్
రచయిత: సిరివెన్నెల
ఈ పాటలో అంతా బాగుంటుంది. ఎక్కడా ద్వంద్వార్థాలు లేకుండా .."నిను నిమరకా నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి" .. అంటూ అమ్మాయి నడుము వర్ణించటం సిరివెన్నెలగారికే సాధ్యం.

10. పాట: మనోహరా ...
సినిమా: చెలి
రచయిత: భువనచంద్ర
ఈ పాట లేకుండా నా లిస్ట్ పూర్తవదు. ఇందులో చెప్పుకోవటానికి అద్భుతమైన లిరిక్స్ ఏం లేవు. కానీ, హారిస్ జయరాజ్ సంగీతం .. Bombay జయశ్రీ గానం ... డబ్బింగ్ సినిమా అయినప్పటికీ భువనచంద్రగారు రాసిన మంచి వ్యాఖ్యాలు.. ఇవన్నీ కలిసి నాకు ఈ పాట అంటే ఇష్టమయ్యేలా
చేశాయి.

ఇవి కొన్ని పాటలే.. ఇలా ఎన్నైనా రాస్తూ ఉండొచ్చు. ఇప్పటికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి.. ఇక నుంచి నాకు బోర్ కొట్టినప్పుడంతా మరికొన్ని పాటల గురించి రాస్తుంటాను.. ఈ పోస్ట్ మీకు నచ్చితే.. ఇందులో చెప్పిన పాటలన్నీ మళ్లీ మళ్లీ వినండి. నచ్చకపోతే ఖతర్నాక్ సినిమాలోని "దోమ కుడితె చికన్ గునియా..ప్రేమ పుడితె సుఖంగునియ" అనే పాట ఒకసారి వినండి.. చచ్చూరుకుంటారు.. సెలవు. ఇందులో అచ్చుతప్పులుంటే మన్నించండి.

Jan 22, 2009

"ఆత్మహత్యకు అరవై దారులు" ... సరదాగా

హెచ్చరిక:నేను రాసే ప్రతి టపా కి ఒక హెచ్చరిక ఉంటుంది. అందుకనే "హెచ్చరిక " అని మొదలుపెట్టాను. కాని, విషయమేంటంటె ఇందులో హెచ్చరించటానికి ఏమి లేదు. పొద్దుపోక రాస్తున్నాను.. అంతే.

మొన్నామధ్య టీవీలో ప్రముఖ రాజకీయవేత్త,బహుభాషాకోవిధుడు అయిన నందమూరి తారకరత్న(ఎవరో తెలుసుగా?) ఇంటర్వ్యూ వచ్చింది. అందులో వ్యాఖ్యాత అడిగే ప్రశ్నలకి వీడి తలతిక్క సమాధానాలు విని ఆత్మహత్యకు సులువైన మార్గం ఏమిటి అనే ఆలోచన వచ్చింది. నాకెలాగూ ప్రాక్తికల్ గా చేసుకొనే ధైర్యం లేదు కాబట్టి విషయంలో రెగులర్ గా ప్రాక్టీస్ చేసే, ఇప్పటికే రెండుమూడుసార్లు ట్రై చేసిన మా నరేష్ గాడితో ఒకసారి మాట్లాడటానికి నిర్ణయించుకున్నాను. నరేష్ గాడి విషయం వచ్చింది కాబట్టి వాడు ఎందుకు సూసైడ్ కి ట్రై చేసాడో తెలుసుకుందాం. ఎలా చేశాడు అనేది నాకు కూడా తెలియని రహస్యం.

మొదటి ప్రయత్నం : మా నరేష్ గాడు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే మిస్స్డ్ కాల్ ఇస్తాడు. కొంచెం అర్జెంట్ అయితే రెండు సార్లు మిస్స్డ్ కాల్ ఇస్తాడు. ఇక మరీ ముఖ్యమైన విషయమైతే ఎదుటివాళ్లు కాల్ చేసేవరకు మిస్స్డ్ కాల్స్ ఇస్తూనే ఉంటాడు. అలాంటిది ఒకసారి వాడు నాకు కాల్ చేసినపుడు పొరపాటున లిఫ్ట్ చేసేసా. అంతే, మా వాడి గుండె పగిలిపోయింది. కోపం,బాధ , ఫ్రస్ట్రేషన్. ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలీక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

రెండో ప్రయత్నం : మా బీటెక్ లొ కోమల అనే ఒక కసక్కు ఉండేది.(
ఒరేయ్.. తప్పురా. లెక్చరర్ ని కత్తి.. కసక్కు .. అనకూడదు) ఆమెను చూసి మా నరేష్ గాడు మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆమె పాఠం చెప్తుంటే మా వాడు ఎప్పుడు 45 deg యాంగిల్ లోకూర్చుని లైన్ వేసేవాడు( ఎందుకలా ... అని అడక్కండి. అదంతే ). అలా కొంతకాలం గడిచాక ఇక ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యి, మదనపల్లె పెద్ద మసీద్ దగ్గర కొన్న అత్తరు పూసుకొని శివాలయం స్వామి దగ్గర 5:45కి ముహుర్తం పెట్టించుకుని సైకిల్ లో కోమల ఇంటికి బయల్దేరాడు. కాని, దారిలో కోమల రజనిల్ రాజ్ అనే గొట్టం గాడి చేతిలో చెయ్యివేసి వెళ్లటం చూసి( లెక్చరర్ ని గొట్టం అనటం కూడా తప్పే ) నరేష్ గాడి గుండె మళ్ళీ పగిలింది. పక్కనే ఉన్న పంక్చర్ షాప్ లో గుండెకి ఒక పాచ్ వేయించుకుని, సైకిల్ని హాఫ్ రేట్ కి అమ్మేసి మా వాడు అస్తమిస్తున్నసూర్యుడి వైపు అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే నరేష్ గాడి జీవితం లో ఎన్నో విషాదగాథలు మరెన్నో గుండెల్ని పిండేసే సందర్భాలు. ఇలా జరిగిన ప్రతీసారి మా వాడు సూసైడ్ కి ట్రై చెయ్యటం అది మిస్సవ్వటం మామూలే. కాకపొతే విషయంలో నేనైనా సక్సస్ అవుతానేమొ చూద్దామని ఎలా ట్రై చేస్తున్నాడో తెలుసుకోవటానికి నేనే వాడికి కాల్ చేశాను(" నేనే వాడికి కాల్చేశాను "... ఇది ఒత్తి పలకండి).

ట్రింగ్... ట్రింగ్...
హలో !! రేయ్ రవిగా ఎలా ఉన్నావ్?
నీయబ్బ.. నేను రా భరత్ ని.
ఓహ్.. నువ్వా. ఇందాక రవిగాడికి మిస్డ్ కాల్ ఇచ్చా ... వాడేనేమొ అనుకున్నా.
!@$%$% .. సర్లే కాని, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా.
ఓహ్.. కంగ్రాట్స్. ఎన్నోసారి?
నీ.... నేను నీలాగ కాదురా.
సరే ..సరే.. అలా ఐతే నువ్వు " ఆత్మహత్యకు అరవై దారులు" అనే పుస్తకం చదువు. నేను కూడా అందులో ఉన్నవే ట్రై చేస్తుంటా.
అందుకేనా ఇంకా ఉన్నావు.
అలా కాదురా.. నాకు పనిచెయ్యలేదు నీకు పని చేస్తుందేమో చూడు.
సరేలే ... నేను ట్రై చేస్తా.
గుడ్... అలాగే నీకు దారి పనిచేసిందో నాకు కాల్ చేసి చెప్పు.
ఒరేయ్ !@$%$%... పెట్రా ఫోను.

సరే.. ఇక పుస్తకం పేరు తెలిసింది కాబట్టి,అందులో ఏముందో తెలుసుకుందామని అది కొనటానికి బెంగుళూరు లో సెకండ్హ్యాండ్ పుస్తకాలు దొరికే అవెన్యూ రోడ్ కి వెళ్లా. ఒక షాప్ కి వెళ్లి అడిగా..

బాబు!! " ఆత్మహత్యకు అరవై దారులు" అనే పుస్తకం ఉందా ?
మీరు సాఫ్ట్ వేర్ ఇంజనీరా?
?????????
అంటే.. మధ్య వాళ్లే పుస్తకాన్ని ఎక్కువగా అడుగుతున్నారు.అందుకే అడిగాను . ఇదిగోండి పుస్తకం.
ఛీ! ఎదవ బతుకు అని మనసులో అనుకుని, నేనేం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని కాదు. ఇంతకీ పుస్తకంలో ఉన్న దారులు పనిచేస్తాయా? ఏదైనా ఫీడ్ బ్యాక్ చూసి కొనటం నాకు అలవాటు. సక్సస్ ఫుల్ గా సూసైడ్ చేసుకున్నవాళ్లు ఎవరైనా ఇందులో ఫీడ్ బ్యాక్ ఇచ్చారా? అని అడిగా.
వాడు నా వైపు విచిత్రంగా చూసి వెకిళిగా నవ్వాడు.(
"ఒరేయ్ తింగరోడా!! సక్సస్ ఫుల్ గా సూసైడ్ చేసుకున్నవాళ్లు ఫీడ్ బ్యాక్ ఎలా ఇస్తార్రా?" అన్న భావం వాడి నవ్వులో కనిపించింది ) నిజం చెప్పండి సార్ మీరు సాఫ్ట్ వేర్ ఇంజనీరే కదా? అని మళ్లీ అడిగాడు.
ఇక దాచటం కష్టమనిపించి, " అవును" అని చెప్పి పుస్తకం లాక్కొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాను.

ఇంతకీ.. పుస్తకంలో ఏముంది? ప్చ్.. ఏమో ఇపుడు చదివే ఓపిక నాకు లేదు. అది తీరిగ్గా చదివి నెక్స్ట్ టపాలో చెప్తా. అంతవరకు సెలవు. మరచిపోయా.. నరేష్ గాడు పార్టీకి పిలిచాడు, వాడి గురించి ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు.