Mar 9, 2012

అనగనగా ఓ ల్యాబ్ ..


'హమ్మయ్య.. తుఫాను తీరం దాటిందంట్రోయ్. ఇక నేను ఆఫీస్‌కి వెళ్ళొస్తా.'
'ఒరేయ్!!!...ఆ.....గు.' నేను ఆగమనేలోపు వీధిలోకి పరుగెత్తాడు.. నరేష్‌గాడు.
వీడు బయట అడుగుపెట్టడం, బయట నీరు ఇంట్లోకి రావటం ఒకేసారి జరిగాయి.

కాసేపటికి వెనక్కి వచ్చాడు.'ఒరేయ్!! తుఫాను తీరం దాటిందంటే నేల నుంచి సముద్రం వైపు వెళ్లిపోయిందని కాదంట..సముద్రంలోంచి నేలపైకి వచ్చిందని అంట.' తడిసిపోయిన షర్ట్ పిండుకుంటూ చెప్పాడు.
'ఆ ముక్క నేను చెప్పే లోపు పారిపోయావ్‌గా.'
'అయినా మన కాలేజ్ రోజులు మేలురా.ఒక చినుకు పడితే చాలు,కాలేజ్‌కి బంక్ కొట్టి ఇంట్లో కూర్చుని మ్యాచ్ చూసుకునేవాళ్ళం. ఇపుడు వరదలొచ్చినా ఆఫీస్‌కి వెళ్ళాల్సిందే.' ప్యాంటు  అంచుల్నించి కారుతున్న నీళ్ళని కాలుతో అటూ ఇటూ జరుపుతూ అన్నాడు నరేష్‌గాడు.

వాడు ఆ మాటలు అంటూనే ...బ్యాక్‌గ్రౌండ్‌లో న్యూస్ వినిపిస్తుండగా....

'చెన్నైలో భారీ వర్షం.జలమయమైన రోడ్లు.వీధిలో పరుగెడుతూ నీళ్లు ఇళ్లలోకి చిమ్ముతున్న వింత మనిషి.పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న పోలీ....'

...అలా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాను.ఆ రోజుల్లో......
---------------------------------------------------------------------------------------------------------------
అవి నేను BTech చదివే రోజులు...మిట్ట మధ్యాహ్నం. రూం బయట నిల్చుని ఆత్రంగా లోపలికి చూస్తున్నా.

మధ్యలో టేబుల్.. అటూ ఇటూ రెండు కుర్చీలు. ఇటువైపు మా లక్ష్మినారాయణ...దొంగతనానికి వెళ్తూ , మొహానికి grease బదులు పాండ్స్ క్రీం రాసుకుని , SP ఇంటికి వెళ్లి , బీరువా అనుకుని ఫ్రిజ్ తెరిచి అందులో ఉన్న ఐస్ ముక్కల్ని జేబులో వేసుకుని, గేటు దగ్గర పడుకున్న కుక్క తోక తొక్కి, పారిపోతూ పోలీసు జీపు ని లిఫ్ట్  కోసం ఆపి, తడి చేతులతో దొరికిపోయిన దొంగలాగా అయోమయంగా చూస్తున్నాడు మా లక్ష్మిగాడు.

టేబుల్ కి అటువైపు..వీడు ఆపిన జీపులో ఉన్న పోలిసులా విజయగర్వంతో ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు.. మా జిలాని సార్.

'సార్!! మీకు దణ్ణం పెడతా.మీరు ఏం చేసినా ఈ వైవా నేను చెప్పలేను.పాస్ మార్కులేసి నన్ను వదిలెయ్యండి.'

'ఏం చేశావని పాస్ చెయ్యమంటావ్ చెప్పు. Micro Controller program ఇచ్చాను. ప్రోగ్రాం రాయమంటే మధ్యలో ..ఇదేంటిది..C + O2 = CO2 అని రాశావ్... ఎలాగయ్యా మీతో వేగేది. పది క్వశ్చన్స్ అడిగాను. ఒక్క ఆన్సర్ అన్నా చెప్పవయ్యా. ఏదో ఒకటి చెయ్యవయ్యా.'

'ఏదో ఒకటి' అనే మాటకు అర్థాన్ని తనకు అనువుగా మలుచుకుని లక్ష్మిగాడు సడెన్‌గా 'పోని ఒక పాట పాడమంటారా?' అని సార్‌కి ఛాయిస్ లేని క్వశ్చన్  ఇచ్చి, దానికి సమాధానంగా కుర్చీ ఎక్కి ఆయన తేరుకునే లోపు 'అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం' అని మొదలెట్టాడు.
అంతే లాబ్‌లో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నట్టు నటిస్తున్న వాళ్లందరూ ఎక్కడి deviceలు అక్కడ పడేసి.. టేబుల్ చుట్టూ తిరుగుతూ స్టెప్పులు వెయ్యటం స్టార్ట్ చేశారు.

'ఆపండయ్యా....ఆపండయ్యా.. యోవ్...ఆపండయ్యా....ఎలాగయ్యా మీతో..'

'ఏమ్మా మీరు కూడా ఏంటమ్మ.. ఆపండమ్మా..' స్టెప్పులేస్తున్న స్టూడెంట్స్ ని  పెన్ను పేపర్లూ విసురుతూ చెదరగొట్టాడు జిలాని సార్.

ఇపుడు మా సార్ నిస్సహాయ స్థితిలో కనిపించాడు.

'నీకు నేను దణ్ణం పెడుతున్నా. ఏదో ఒకటి చేసి నిన్ను పాస్ చేస్తా. ముందు నువ్ వెళ్ళవయ్యా బాబూ.' అంటూ లక్ష్మిగాడిని బయటకు పంపాడు.

ఇందాక స్టెప్పులేస్తూ జిలాని సార్ కాలు తొక్కి పారిపోయి ఓ మూలలో నిల్చున్నాడు నరేష్‌గాడు. వాడికి ట్రాఫిక్ సిగ్నల్ ప్రోగ్రాం వచ్చింది. ఇందాకట్నించి connecting wire తో తల గోక్కుంటూ తెగ ఆలోచిస్తున్నాడు. అదే wireతో పక్కనే ఉన్న అలివేలుని గోకుతూ..'అలివేలు !!అసలు ట్రాఫిక్ సిగ్నల్‌లో నాలుగో లైట్ ఏ కలర్‌లో ఉంటుంది' అని అడిగాడు.మరి వాడు గోకినందుకు కాలిందో లేక ఆ ప్రశ్నకు  సమాధానం తనకు తెలియదు అని తెలిసి అదే పనిగా అడిగాడు దొంగసచ్చినోడు అని అనుకుందో, 'సార్!! వీడు నన్ను గో....కు...తు..న్నాడు' అని గావుకేక పెట్టబోయి , 'నీకు కావాల్సిన ప్రోగ్రాం నా దగ్గర ఉంది ' అని నరేష్‌గాడు జేబులోంచి micro xerox పేపర్ తియ్యటంతో శాంతించింది.

ఇక నరేష్‌గాడు ఎలాగో తన ప్రోగ్రాం అవగొట్టి , జిలాని సార్ దగ్గరకు వెళ్ళి, 'క్షమించాలి. ట్రాఫిక్ సిగ్నల్‌లో నాలుగో లైట్ వెలిగించలేకపోయాను. ఇక మీ దయ నా ప్రాప్తం' అని వచ్చేప్పుడు తెచ్చుకున్న పూలుపండ్లు, ఒక పట్టు పంచె సార్ చేతిలో పెట్టి ల్యాబ్ నుంచి బయటపడ్డాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో జిలాని సార్ రికార్డుతో తలబాదుకోవటం వాడు చూడలేదు.

ఇదిలా ఉంటే,ల్యాబ్ బయట అమ్మాయిలు గుంపుగా నిల్చుని గుసగుసలాడుకుంటున్నారు. విషయం ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే, చక్రవాకం సీరియల్‌లో జేమ్స్ అంకుల్‌ని ఎవరు కిడ్నాప్ చేశారా అని ఒకరి తల ఒకరు గోక్కుంటున్నారు. ఛీ ఎదవ జీవితం.

ఇంతలో అలివేలు గెంతుకుంటూ వచ్చి.. 'హేయ్ !! మీకు తెలుసా. నరేష్ నాకు ల్యాబ్‌లో చాలా హెల్ప్ చేశాడు. జిలాని సారైతే నన్ను ఒక్క క్వెశ్చన్ కూడా అడగలేదు.' అని నరేష్‌గాడు ఇచ్చిన స్లిప్ చూపించింది.
అది చూసి అమ్మాయిలందరూ ముక్త కంఠంతో "వావ్!!" అన్నారు.

నరేష్... ల్యాబ్... హెల్ప్...ఇందులో ఏదో అపశ్రుతి  ఉందే అని ఆ స్లిప్ చూశాను. "మీ బొంద వావ్!! అయిపోయిన సినిమా షో కి బ్లాక్‌లో టికెట్ కొన్నట్టు..నువ్ రాయాల్సిన ప్రోగ్రాం ఇది కాదు. ఇది నిన్నటి ల్యాబ్ ప్రోగ్రాం. వాడు నిన్ను మోసం చేశాడు. అయినా జిలాని సార్ దీనంగా చూస్తూ నీకు దణ్ణం పెట్టి బయటకు పంపినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇలాంటిదేదో జరిగింటుందని " అని చెప్పా.

ఇదంతా గోడెనకాల నిల్చుని చూస్తున్న నరేష్‌గాడు విజయగర్వంతో వికటాట్టహాసం చేస్తున్నాడు. అది చూసి అలివేలు "ఒరేయ్ సచ్చినోడా!! ఉండు  నీ అంతు చూస్తా" అని పరిగెత్తింది.

"పోవే.. ఫస్ట్ ఇయర్ C ల్యాబ్‌లో ప్రైం నంబర్ అంటే ఏంటి అని నేను అడిగితే.. సార్ వీడికి ప్రైం నంబర్ అంటే తెలీదంట అని గట్టిగా అరచి నన్ను అవమానించావ్‌గా. ఇప్పుడు నీ దిక్కున్న చోట చెప్పుకోపో" అని రన్నింగ్ బస్‌ని ఛేస్ చేసి ఫుట్‌బోర్డ్ మీద ఊగుతూ పారిపోయాడు నరేష్‌గాడు.
-------------------------------------------------------------------------------------------------------------
ఇదంతా ఒకెత్తైతే ఇంటర్‌లో ప్రాక్టికల్స్ మరోలా ఉండేవి. ఏదో మొక్కుబడిగా ప్రాక్టికల్స్ చేయించేవాళ్లు. ఐతే అక్కడ కూడా ల్యాబ్ అసిస్టెంట్ల బిల్డప్ ఏమాత్రం తగ్గేది కాదు . కాకపొతే ల్యాబ్ అసిస్టెంట్‌కంటే మమ్మల్ని ఎక్కువ భయపెట్టే వ్యక్తి మరొకరు ఉన్నారు. అతనే మా కాలేజ్ అటెండర్ రెడ్డప్ప. రోజూ క్లాస్‌రూమ్స్‌కి వచ్చి అటెండెన్స్ వేస్కోవటం దగ్గర్నించి .. ఎవడెవడు క్లాస్ ఎగ్గొట్టి గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్నాడు...ఎవడు ఏ అమ్మాయితో తిరుగుతున్నాడు లాంటి చట్ట వ్యతిరేక పనులను పసిగట్టి మా ప్రిన్సిపల్ EVRకి ఉప్పందించేవాడు. మా EVR ఆ ఉప్పులో కొంచెం కారం కలుపుకుని..అది కాస్త నాలిక్కి రాసుకుని, మంట నషాలానికెక్కాక...మేము మనుషులం అన్న విషయాన్ని కాసేపు తన మనసులోంచి చెరిపేసుకుని చితకబాదేవాడు.

 ఇది పక్కన పెడితే.. మా కెమిస్ట్రి ల్యాబ్‌కి పెద్దదిక్కు రెడ్డప్ప. ఎందుకంటె ఫైనల్ ప్రాక్టికల్స్‌లో ఎవడికి ఎన్ని మార్కులు వస్తాయో మా రెడ్డప్ప మీదే ఆధారపడేది. అంతేకాకుండా వాసన చూసి అది ఏ లవణమో ఠపీమని చెప్పేంత దిట్ట. అప్పట్లో మాకు గోల్డ్‌రింగ్ ఎక్స్‌పరిమెంట్ అని ఉండేది. మా ల్యాబ్ అసిస్టెంట్ MRగాడు ఎంత ట్రై చేసినా ల్యాబ్‌లో ఉన్న వాళ్లకు దగ్గు, తుమ్ములు వచ్చేవి తప్ప టెస్ట్‌ట్యూబ్‌లో గోల్డ్‌రింగ్ మాత్రం వచ్చేది కాదు. ఇలాగే ఓరోజు రింగ్ తెప్పించటానికి విఫలయత్నం చేస్తుంటే మా రెడ్డప్ప వచ్చాడు. MRగాడి చేతిలోంచి టెస్ట్‌ట్యూబ్ లాక్కొని, కొంచెం ఇదీ కొంచెం అదీ కలిపి, వేలితో రెండు సార్లు టంగ్‌టంగ్ అని కొట్టి, చూమంతర్ అన్నాడు. అంతే దగదగ మెరిసిపోతూ టెస్ట్‌ట్యూబ్‌లో గోల్డ్‌రింగ్ కనపడింది. అది చూసి మురిసిపోతూ మా క్లాస్ గర్ల్స్ అందరూ "వావ్!! వాట్ ఏ మ్యాన్ " అన్నారు. కుడి చేతిలో టెస్ట్‌ట్యూబ్, ఎడమ చేతిలో అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకుని ఇంచుమించు Statue of Liberty లెవల్లో నిలబడ్డాడు రెడ్డప్ప. నాలుగు conical flaskలు పగలగొట్టి రెడ్డప్ప నెత్తిమీద చెక్కెయ్యాలన్నంత కోపం వచ్చింది MRగాడికి. వెంటనే టెస్ట్‌ట్యూబ్ లాక్కుని నేను రెండు రింగులు తెప్పించి మీ చేత వహ్వా!! వహ్వా!! అనిపించుకుంటా అని చెప్పి.. ఆ టెస్ట్‌ట్యూబ్‌లో ఉన్న రింగుని నరేష్‌గాడి వేలికి తొడిగి... ఇందాక కలిపిన అదీ ఇదీతో పాటు కొంచం ఏదో కలిపాడు.  

అందరం టెన్షన్‌గా టెస్ట్‌ట్యూబ్ వైపు చూస్తున్నాం. నరేష్‌గాడు మా క్లాస్ ఫిగర్ అనసూయ వైపు చూస్తున్నాడు. అనసూయ వంశిగాడి వైపు చూస్తోంది. వంశిగాడు అటూఇటూ చూసి రెండు టెస్ట్‌ట్యూబ్లు జేబులో వేస్కున్నాడు.
కెమరా మళ్ళీ MR వైపు తిరిగింది. ల్యాబ్ మొత్తం నిశ్శబ్ధం. ముందు పొగొచ్చింది..తర్వాత వాసనొచ్చింది.. ఇంకాసేపటికి పెద్ద శబ్ధం వచ్చింది. రెండు రోజుల తర్వాత మాకు కొత్త ల్యాబ్ అసిస్టెంట్ వచ్చింది. పనిలో పనిగా మా రెడ్డప్పకి నెత్తిమీద ఇంకో కొమ్మొచ్చింది .

ఫైనల్ ప్రాక్టికల్స్‌కి వెళ్లేముందు రెడ్డప్ప చేతిలో యాభై రూపాయలు పెట్టి కాళ్లకు దండం పెట్టుకుని ల్యాబ్‌లో అడుగుపెట్టేవాళ్లం. కాసేపటికి రెడ్డప్ప ల్యాబ్‌లో్‌కి వచ్చి అందరికి ఉప్పందించేవాడు. అంటే ఇది నిజం ఉప్పు అన్నమాట. ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి ఒక్కో పొట్లం ఇస్తూ అది ఏ లవణమో గట్టిగా, మాకు మాత్రమే వినపడేలా చెప్పి వెళ్ళిపోయేవాడు. ఇక చెప్పేదేముంది ఆన్సర్ చుట్టూ ఎక్స్‌పరిమెంట్ అల్లేసి ఎలాగోలా వైవా అవగొట్టి ల్యాబ్ నించి  బయటపడేవాళ్ళం .

ఇక physics ల్యాబ్‌కి పెద్దదిక్కుగా సింగల్ జీన్స్ రమణ ఉండేవాడు. ఆ పేరు వింటే తెలుస్తోందిగా ..ఒకే జీన్స్ ని వారంలో ఆరు రోజులు కాలేజ్‌కి వేసుకొచ్చేవాడు. అంటే ఆదివారం ఉతుక్కుంటాడు అని కాదు. ఆ రోజు అదే ప్యాంట్‌తో సినిమాకి వచ్చేవాడు. మొన్నామధ్య పురావస్తు శాఖ వాళ్ళు మదనపల్లె BT కాలేజ్‌లో తవ్వకాలు జరుపుతుంటే ఈ ప్యాంట్ బయటపడింది. మొదట ఇదేదో బ్రిటిష్ కాలం నాటిది అనుకున్నారు.తర్వాత దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు.ఆ ప్యాంటు అంచులకున్న జిప్స్, సైడ్‌కి కుట్టిన ప్యాచులు, వెనకాల లేబుల్ మీద Ruf n Tuf(నిజంగా ఒరిజినల్) అని తెలుగులో రాసి ఉండటం..ఇన్ని ఆధారాలను చూసి ఇది ఖచ్చితంగా మా రమణదే అని డిసైడ్ అయ్యారు.అతి ఎక్కువ రోజులు ఉతక్కుండా వాడిన జీన్స్ ప్యాంట్ అని చెప్పి మ్యూజియంలో పెట్టారు. అది వేరే విషయం.

ఇక physics ల్యాబ్ విషయానికి వస్తే ..vernier callipersలు , screw gaugeలు కొట్టేయటం, పెన్ క్యాప్‌లో mercury వేస్కోవటం, మా ల్యాబ్ అసిస్టెంట్ 'Boxer' గాడి బైక్ టైర్‌లో గాలి తీసెయ్యటం..ఫైనల్ ప్రాక్టికల్స్‌లో ముందు రీడింగ్స్ రాసేసి తర్వాత ఎక్స్పరిమెంట్ చెయ్యటం..ఇవన్నీ  మాములే.

మరచిపోలేని రోజులు .. తిరిగిరాని రోజులు.. :(

---------------------------------------------------------------------------------------------------------------

Breaking News...అని న్యూస్ రీడర్ గావుకేక పెట్టడంతో నా ఫ్లాష్‌బ్యాక్ బ్రేక్ అయింది.
"ఉదయం నుంచి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగుతున్న వింత మనిషి పట్టివేత. "

వీడెక్కడికి వెళ్ళాడు ... రేయ్ నరేష్‌గా .. ఎక్కడున్నావ్?...