Jun 22, 2009

స..రి..గ..మ..ప..

బ్లాగ్ రాసి చాలా రోజులైంది. కొంచెం బిజీగా ఉన్నాను. అంటే.. నిజంగానే బిజీగా ఉన్నాను. సరే మరి ఏ విషయం గురించి రాద్దాం అని ఆలోచిస్తుండగా ఇవాళ (Jun 21st) ప్రపంచ సంగీత దినోత్సవం అని తెలిసింది.అంతే .. నాలో నిద్రపోతున్న కళాకారుడిని, మొహమ్మీద బకెట్ నీళ్లు పోసి లేపాను. ఇక లేచిన వాడు ఊరికే ఉండక ఇలా బ్లాగు రాసి మీ మీదకు వదులుతున్నాడు. విషయమేంటంటే, నాకు ఇష్టమైన కొన్ని పాటలు, అందులో నచ్చిన లిరిక్స్ గురించి వ్రాయాలనుకుంటున్నాను. మీకు ఓపిక ఉంటే చదవండి.

గమనిక: ఇందులో ఎక్కువగా సిరివెన్నెలగారి పాటలే ఉంటాయి మరియు విరహ గీతాలు ఎక్కువగా ఉంటాయి. మరొక విషయం .. ఇవి నాకు ఇష్టమైన పాటలు. మీకు నచ్చొచ్చు నచ్చకపోవొచ్చు.

1.పాట: కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు
సినిమా: నువ్వేకావాలి
రచయిత: సిరివెన్నెల
" 'మనం' అన్నది ఒకే మాటని నాకిన్నాళ్లు తెలుసు. నువ్వూ నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు ఉంది మనసు " . ఒకరిలో ఒకరిగా కలిసిపోయిన ప్రాణస్నేహితులు విడిపోతుంటే వచ్చే ఈ పాటవిన్న ప్రతిసారి నా కళ్లలో నీళ్లు వస్తాయి.

2. పాట: నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైన.
సినిమా: బొమ్మరిళ్లు
రచయిత: సిరివెన్నెల
"నా వెనువెంట నీవే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా" ... ఈ లిరిక్స్ విన్నప్పుడు నాకు నేను గుర్తొస్తాను.మరొకరికి కూడా నేను గుర్తొస్తాను .

మరీ ఏడుపు పాటలు ఉన్నట్టున్నాయి కదా. కాసేపు ట్రెండ్ మారుద్దాం.

3. పాట: ఏమంటారో నాకు నీకున్న ఇదినీ .
సినిమా: గుడుంబా శంకర్
రచయిత:
చంద్రబోస్
"ఇష్ట కష్టాలని ఇపుడేమంటారో.. ఈ మోహమాటాలని మరి ఏమంటారో
స్వల్ప భారాలని ఇపుడేమంటారో.. సమీప దూరాలని అసలేమంటారో" .. ఇలా మొదటి చరణం లో ఏమంటారో అంటూ ప్రేమ గురించి చెప్తే.. రెండో చరణం లో
"నాలొ నువ్వునీ.. ఇక నీలో నేనునీ ..
మాకే మేమనీ మన దారే మనదనీ" అంటూ పెళ్లి గురించి చెప్తాడు.

4. పాట: ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా .
సినిమా: చక్రం
రచయిత: సిరివెన్నెల
"నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం..
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం" ... నువు లేనిదే నేను లేనని మీ ప్రేయసికి ఇంతకంటే అందంగా ఎలా చెప్పగలరు..

5. పాట: గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి .
సినిమా: డాడీ
రచయిత: సిరివెన్నెల
"నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేనో.. ఎవరినెవరు లాలిస్తున్నారో" తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ప్రేమను ఇంత అందంగా సిరివెన్నెలగారే చెప్పగలరు.

6. పాట: ఎగిరే.. ఎగిరే .
సినిమా: కొంచెం ఇష్టం కొంచెం కష్టం
రచయిత: చంద్రబోస్
"ఈ క్షణమే సంబరం..ఈ క్షణమే శాశ్వతం.. ఈ క్షణమే జీవితం.. తెలిసిందీ ఈ క్షణం " ... ఇందులో నచ్చటానికి ఏముంది అనుకుంటున్నారా.. ఒకసారి ఆ పాట చూడండి.. సినిమాలో అప్పటి వరకు రిజర్వ్డ్ గా ఉన్న హీరోయిన్ .."ఈ క్షణమే జీవితం.. తెలిసిందీ ఈ క్షణం" అని రాగానే.. గొడుగు విసిరేసి వర్షం లో తడుస్తూ అందరితో కలిసిపోతుంది. లిరిక్స్ కి తగినట్టు పాట తీయడం.. అలా తీయగలిగేటట్టు పాట వ్రాయటం నాకు నచ్చింది.

7. పాట: కళ్లలోన నువ్వు..గుండెల్లోన నువ్వు.
సినిమా: నా ప్రాణంకంటే ఎక్కువ (ఈ సినిమా పేరు కూడా చాలా మంది విని ఉండరు.)
రచయిత: శశి ప్రీతం
"ఈ జన్మకు నువు కాదంటే .. వచ్చే జన్మన్నా.. అది కూడా నువు కాదంటే.. జన్మను వద్దన్నా".. లవ్ ఫెయిల్ అయిన వాళ్ల కోసం చాలా పాటలు వచ్చాయి.. అందులో ఇదీ ఒకటి... అలాగే ఈ సినిమాలో "నిన్నే చూశాక" అని సునీత పాడిన పాట కూడా బాగుంటుంది..

8. పాట: కిట కిట తలుపులు ...
సినిమా: మనసంతా నువ్వే
రచయిత: సిరివెన్నెల
"కంట తడి నాడూ నేడు... చెంప తడిమిందీ చూడు.. చెమ్మలో ఎదో తేడా కనిపించలేదా?".. ప్రేమికులు విడీపోయేప్పుడు వచ్చే కన్నీటిని.. మళ్లీ కలిసినప్పుడు వచ్చే ఆనందభాష్పాలనీ .. ' చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా? ' అంటూ ఒకే వ్యాఖ్యం లో చెప్పడం చాలా చాలా నచ్చింది.

9. పాట: చిట్టి నడుమునే చూస్తున్నా ...
సినిమా: గుడుంబా శంకర్
రచయిత: సిరివెన్నెల
ఈ పాటలో అంతా బాగుంటుంది. ఎక్కడా ద్వంద్వార్థాలు లేకుండా .."నిను నిమరకా నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి" .. అంటూ అమ్మాయి నడుము వర్ణించటం సిరివెన్నెలగారికే సాధ్యం.

10. పాట: మనోహరా ...
సినిమా: చెలి
రచయిత: భువనచంద్ర
ఈ పాట లేకుండా నా లిస్ట్ పూర్తవదు. ఇందులో చెప్పుకోవటానికి అద్భుతమైన లిరిక్స్ ఏం లేవు. కానీ, హారిస్ జయరాజ్ సంగీతం .. Bombay జయశ్రీ గానం ... డబ్బింగ్ సినిమా అయినప్పటికీ భువనచంద్రగారు రాసిన మంచి వ్యాఖ్యాలు.. ఇవన్నీ కలిసి నాకు ఈ పాట అంటే ఇష్టమయ్యేలా
చేశాయి.

ఇవి కొన్ని పాటలే.. ఇలా ఎన్నైనా రాస్తూ ఉండొచ్చు. ఇప్పటికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి.. ఇక నుంచి నాకు బోర్ కొట్టినప్పుడంతా మరికొన్ని పాటల గురించి రాస్తుంటాను.. ఈ పోస్ట్ మీకు నచ్చితే.. ఇందులో చెప్పిన పాటలన్నీ మళ్లీ మళ్లీ వినండి. నచ్చకపోతే ఖతర్నాక్ సినిమాలోని "దోమ కుడితె చికన్ గునియా..ప్రేమ పుడితె సుఖంగునియ" అనే పాట ఒకసారి వినండి.. చచ్చూరుకుంటారు.. సెలవు. ఇందులో అచ్చుతప్పులుంటే మన్నించండి.